గురువారం 04 జూన్ 2020
Telangana - May 09, 2020 , 14:41:31

రానున్న రోజులు వరంగల్‌వే...

రానున్న రోజులు వరంగల్‌వే...

మ‌రో ఏడాది కాలంలో తెలంగాణ‌కు ఉజ్వ‌ల భ‌విష్య‌త్తు రానున్న‌దన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు. మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరులో నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసారు రాష్ట్ర పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ క‌రోనా కార‌ణంగా చైనాలోని ప‌రిశ్ర‌మ‌లు మ‌న తెలంగాణ‌కే రానున్నాయి అన్నారు. ఇందుకు సీఎం కేసీఆర్, ఐటీ శాఖా మంత్రి కేటీఆర్‌ల కృషి ఎంతో ఉందన్నారు మంత్రి. ఆ ప‌రిశ్ర‌మ‌ల‌ను వ‌రంగ‌ల్‌లోనే పెట్టాల‌నే సంక‌ల్పంతో కేసీఆర్, కేటీఆర్‌లు ఉన్నారని తెలిపారు. ఆ విధంగా వ‌రంగల్ కూడా అద్భుతంగా అభివృద్ధి చెందుతుందని  ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు పెరుగుతాయన్నారు.

మరో ఏడాది పాటు క‌రోనా వైర‌స్ క‌ష్టాలు ప్ర‌పంచం మొత్తానికి ఉండ‌నున్నాయన్నారు మంత్రి. ఈ లోగా చైనా ప‌రిశ్ర‌మ‌లు ఇండియాకే రావాల‌ని నిర్ణ‌యించాయి. ప్ర‌ధాని మోడీని ఆ పారిశ్రామిక‌వేత్త‌లు సంప్ర‌దించి, త‌మ ప‌రిశ్ర‌మ‌ల‌ను తెలంగాణ‌లోనే పెడ‌తామ‌ని చెప్పాయ‌ని, ఇష్టం లేకున్నా, మోడీ ఆ ప‌రిశ్ర‌మ‌ల‌ను తెలంగాణ‌కు రావ‌డానికి అంగీక‌రించార‌ని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు చెప్పారు.

ప్ర‌స్తుతం వ‌రంగ‌ల్ జిల్లా కేంద్రానికి అవుట‌ర్ రింగ్ రోడ్డు వ‌స్తున్న‌దని తెలిపారు. ప్రస్తుతం వరంగల్‌లో మంచినీటి వ‌స‌తి ఉందని, దేవాదుల‌, ఎస్సారెస్పీ, కాళేశ్వ‌రం నీరు అందుతున్న‌దని దీంతో ఇటు రైతాంగం బాగుప‌డుతుందన్నారు. ఇక ప‌రిశ్ర‌మలు కూడా వ‌స్తే, చ‌దువుకున్న వాళ్ళ‌కు ఉద్యోగాలు, ఉపాధి కూడా ల‌భిస్తాయ‌ని మంత్రి చెప్పారు. క‌రోనా వైర‌స్ విస్త‌ర‌ణ‌, ప‌రిస్థితుల‌ను బ‌ట్టి లాక్ డౌన్ ఉంటుంద‌ని, లాక్ డౌన్‌ని ప‌క‌డ్బందీగా నిర్వ‌హించి మ‌న‌మంతా ఆరోగ్యంగా ఉండాల‌న్నారు. అంతేగాక‌ ఈ స‌మ‌యంలో నిరుపేద‌ల‌ను ఆదుకోవాల‌ని దాతలు, నేత‌లు ముందుకు రావాల‌ని మంత్రి పిలుపునిచ్చారు. స్థానికంగా ఉండే అశోక్ రెడ్డి, శ్రీ‌నివాస్ త‌దిత‌రుల స‌హ‌కారంతో నిత్యావ‌స‌ర స‌రుకుల‌ను మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు నిరుపేద‌ల‌కు పంపిణీ చేశారు.


logo