శనివారం 30 మే 2020
Telangana - May 08, 2020 , 21:05:56

గిరిజనులకు నిత్యావసరాల పంపిణీ

గిరిజనులకు నిత్యావసరాల పంపిణీ

వైరస్ కట్టడి కోసం ప్రభుత్వం  అమలు చేస్తున్న లాక్ డౌన్ వల్ల గిరిజనులకు గిరిజనేతరులకు మధ్య సంబంధాలు తెగిపోవడంతో గిరిజనులకు నిత్యావసర సరుకులు అందక, గిరిజన ఉత్పత్తులు విక్రయించలేక ఇబ్బంది పడుతున్నారని గుర్తించిన రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ వీరిని ఆదుకునేందుకు అధికారులను ఆదేశించారు. వెంటనే 6819 కుటుంబాలకు గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేకంగా 512 రూపాయల విలువైన సరుకుల కిట్ ను ఉట్నూరు ఐటీడీఏ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. 

అదేవిధంగా నల్లమల ప్రాంతం నాగర్ కర్నూల్, నల్లగొండ, మహబూబ్‌నగర్, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలోని 4259 చెంచు కుటుంబాలకు 23 లక్షల విలువైన నిత్యావసర కిట్లను పంపిణీ చేయడం జరిగింది. గిరిజన సహకార సంస్థ(జీసీసీ) ఆధ్వర్యంలో కొనుగోలు చేసే అటవీ ఉత్పత్తులైన తేనే, ఇప్పపువ్వు, బంక, జీడిగింజలు, వాగైత్రాలు కనీస  ధరను 50% నుండి 80% మేరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 

కరోనా వైరస్ కట్టడి కాలంలో ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న గిరిజన తెగలకు ఈ పెంపు వల్ల ఆర్ధిక వెసులుబాటు కల్పించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. గిరిజనులు సేకరించిన ఉత్పత్తులన్నీ సేకరించాలని కూడా మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. లాక్ డౌన్ వల్ల తాము ఇబ్బందులు పడుతున్నామన్న భావన వారిలో రాకుండా చూసుకోవాలన్నారు.


logo