మంగళవారం 26 మే 2020
Telangana - May 08, 2020 , 20:38:43

విద్యుత్‌ ప్రైవేటికరణకు కేంద్రం కుట్ర

విద్యుత్‌ ప్రైవేటికరణకు కేంద్రం కుట్ర

కేంద్ర ప్రభుత్వం తీసుకరానున్న విద్యుత్ ముసాయిదా చట్టాన్ని ముమ్మాటికి అడ్డుకుని తీరుతామని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.  విద్యుత్ రంగ సంస్థలను ప్రయివేటికరించాలన్న కుట్రలో ఇదొక భాగమని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రవేశ పెట్టనున్న 2020 విద్యుత్ సవరణ చట్టంపై హైదరాబాద్‌లో శుక్రవారం రాత్రి మీడియాతో మాట్లాడిన మంత్రి ఎట్టి పరిస్థితుల్లో ఈ బిల్లును ఆమోదించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.  ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ బిల్లుకు వ్యతిరేకంగా తన మనోగతాన్ని వెల్లడించిన అంశాన్ని మంత్రి ఈ సందర్భంగా ఉటంకించారు. 

కేంద్రప్రభుత్వం ప్రవేశ పెట్టబోయే ఈ బిల్లుతో తెలంగాణలో భారం పడేది మొదట వ్యవసాయదారులపై అన్నారు. తరువాత గృహా వినియోగదారులపై ఈ ప్రభావం ఉంటుందని ఆయన తెలిపారు. ఈ చట్టం అమలులోకి వస్తే రాష్ట్రంలో ఉన్న 25 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగిస్తారని ఆయన వెల్లడించారు.  అంతే కాకుండా 69 లక్షల గృహా వినియోగాదారులపై అదనపు భారం పడబోతుందన్నారు. అటువంటి బిల్లును ఏ రకంగా ఆమోదిస్తారని ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు. 

మొత్తంగా దేశవ్యాప్తంగా విద్యుత్ రంగాన్ని ఈ బిల్లుతో తొలుత తమ అధీనం లోకి తెచ్చుకుని తద్వారా ప్రైవేటికరణకు కేంద్రం వ్యూహం రూపొందించిందని మంత్రి జగదీష్ రెడ్డి ధ్వజమెత్తారు. పైగా రేనబుల్ ఎనర్జీతో మరింత ప్రమాదం ఎదుర్కోవలసి వస్తుందని ఆయన అన్నారు. వారు నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి కప్పం కట్టాల్సి వస్తుందన్నారు. అంతర్గత భద్రత, అంతర్జాతీయ వ్యవహారాలు, దేశ రక్షణ వంటి కీలక రంగాలు వదలి పెట్టి రాష్ట్ర ప్రభుత్వాల అధీనంలో విజయవంతంగా నడుస్తున్న విద్యుత్ రంగంపై పెత్తనం కోసం ఇటువంటి చట్ట సవరణలు తేవడం మానుకోవాలని మంత్రి హితవు పలికారు.


logo