శనివారం 06 జూన్ 2020
Telangana - May 07, 2020 , 21:40:27

కోవిడ్‌ సేవల్లో ‘కోవిద’

కోవిడ్‌ సేవల్లో ‘కోవిద’

వస్త్రాలు, పండ్లు, మందులు, ఆహారం, మాస్కుల పంపిణీ

‘కోవిద సహృదయ ఫౌండేషన్‌’ ఆధ్వర్యంలో నెల రోజులుగా సేవలు

హైదరాబాద్‌: కరోనా లాక్‌డౌన్‌ కాలంలో ఇబ్బందులు పడుతున్న వివిధ వర్గాలు, పేదలు, వలస కార్మికులకు సామాజిక బాధ్యతగా అనేక సంస్థలు సేవలందిస్తూ పలువురికీ స్ఫూర్తినిస్తున్నాయి. సమాజంలో ఎందరో ఉన్నా స్పందించే హృదయాలు, చేయూతనిచ్చే సహృదయులు కొందరే ఉంటారు! వారిలో ‘కోవిద సహృదయ ఫౌండేషన్‌’ ఒకటి. సేవలు ఎక్కడైతే అవసరమవుతాయో.. అలాంటి వారికి అరుదైన సేవలందిస్తూ చాలా మందికి ప్రేరణను ఇస్తోంది ‘కోవిద’. ఆ సంస్థ వ్యవస్థాపకురాలు, సినీ కాస్ట్యూమ్స్‌ డిజైనర్‌, నిర్మాత, డాక్టర్‌ అనూహ్యా రెడ్డి ఆధ్వర్యంలో నెల రోజులుగా నిరాటంకంగా ఈ విపత్కర సమయంలో అవసరమైన వారికి, బడుగు, బలహీన వర్గాలకు నిత్యావసర వస్తువులు, రోగ నిరోధక శక్తిని పెంచే పండ్లు, కోడిగుడ్లు, భోజన ప్యాకెట్లను అందిస్తున్నారు. అవసరమున్న చోట మాస్క్‌లు, శానిటైజర్లు, వస్త్రాలు, చీరెలు, నైటీలు, లో దుస్తువులు అందిస్తూ ‘కోవిద’ సంస్థ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. 

దివంగత సంగీత దర్శకుడు చక్రీ తమ్ముడు మోహిత్‌, వారి తల్లి మణికొండ పరిధిలోని బస్తీలు, గల్లీలు, మురికి వాడల్లో ఇబ్బందులు పడుతున్న వారి గురించి తెలుసుకొని వారికి ఈ రోజు రెండు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు, మందులను అందించారు. అలాగే, కృష్ణానగర్‌, మూసాపేటలో ఉన్న 150 మంది ట్రాన్స్‌జెండర్స్‌కు అవసరమైన నిత్యావసర వస్తువులు, కూరగాయలు, కోడిగుడ్లతో పాటు కొంత ఆర్థిక సాయం చేశారు.

       

మాట్లాడుతూ, లాక్‌డౌన్‌లో పేదలు, బడుగులు, బలహీన వర్గాలు పడుతున్న కష్టాలు చూసి తమ సంస్థ ద్వారా సేవలందించాలని నిర్ణయించుకున్నట్టు అనూహ్యారెడ్డి తెలిపారు. రాజ్‌భవన్‌లో పని చేస్తున్న కింది స్థాయి మహిళా సిబ్బందికి, పారిశుధ్య కార్మికులకు వస్త్రాలు, లో దుస్తువులు, నైటీలు, పురుషులకు పంచెలు, నెల రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు అందించినట్టు ఆమె తెలిపారు. అయితే, తమ సంస్థ ద్వారా రోజుకు రెండు కాలనీలను ఎంపిక చేసుకొని ప్రతిరోజూ 500 మందికి పైగా భోజనం, నిత్యావసర వస్తువులు, పండ్లు, కోడిగుడ్లు, శానిటైజర్లు, మాస్కులు ఇస్తున్నట్టు ఆమె తెలిపారు.


logo