గురువారం 28 మే 2020
Telangana - May 05, 2020 , 14:44:10

ఉపాధి హామీ కూలి మృతిపై స్పందించిన మంత్రి కొప్పుల ఈశ్వర్‌

ఉపాధి హామీ కూలి మృతిపై స్పందించిన మంత్రి కొప్పుల ఈశ్వర్‌

  • అధికారులతో ఫోన్‌లో మాట్లాడిన మంత్రి
  • అంత్యక్రియలకు సహాయం చేస్తానని హామీ

పెద్దపల్లి: జిల్లాలోని ధర్మారం మండలం బొట్లవనపర్తి గ్రామ శివారులో జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా పనికి వెళ్ళి వడదెబ్బ తగిలి మరణించిన కూలీ రెడపాక శంకరయ్య(48) మరణంపై మంత్రి కొప్పుల ఈశ్వర్‌ విచారం వ్యక్తం చేశారు. మృతుని కుటుంబానికి వెంటనే పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మంత్రి. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక తహసిల్దార్‌ సంపత్‌, ఎంపీడీవో బాలరాజు, ఎస్సై ప్రేమ్‌ కుమార్‌, ఉపాధి హామీ ఏపీవో రవి రంగంలోకి దిగి శంకరయ్య మృతి వివరాలు తెలుసుకున్నారు. 

పెద్దపల్లి జిల్లా ఉపాధి హామీ ఇంచార్జ్‌ పీడీ, జెడ్పీ సీఈవో వినోద్‌కు మంత్రి ఫోన్‌ చేసి మృతుని కుటుంభానికి ప్రభుత్వం ద్వారా రావలసిన పరిహారాన్ని త్వరగా అందజేసేలా ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో సీఈవో వినోద్‌, డీపీవో సుదర్శన్‌లు హుటాహుటిన బొట్లవనపర్తి గ్రామానికి చేరుకుని మండల అధికారుల నుండి వివరాలను సేకరించారు. కాగా శంకరయ్య అంత్యక్రియలకు కావాల్సిన ఆర్థిక సాయం చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.


logo