బుధవారం 27 మే 2020
Telangana - May 04, 2020 , 19:17:36

సీఎం సహాయనిధికి జడ్పీటీసీలు, ఎంపీటీసీలు విరాళం

సీఎం సహాయనిధికి జడ్పీటీసీలు, ఎంపీటీసీలు విరాళం

నిజామాబాద్ : కరోనా వైరస్‌ కట్టడికి సీఎం కేసీఆర్‌ చేస్తున్న కృషికి మద్దతుగా మేమున్నామంటూ పలువురు ముందుకు వస్తున్నారు. ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు, సేవా సంస్థలు, సామాన్య ప్రజలు సైతం తమ వంతుగా సీఎం సహాయనిధికి విరాళం అందించి ఉదార స్వభావం చాటుకుంటున్నారు. 

తాజాగా ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన జడ్పీటీసీలు, ఎంపీటీసీలు సీఎం సహాయ నిధికి విరాళంగా రెండు లక్షల ఆరు వేల రూపాయల చెక్కును మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు అందజేశారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజల సురేందర్ ఆధ్వర్యంలో పలువురు జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు మాజీ ఎంపీ కవిత గారిని కలిసి చెక్కును అందజేశారు. 

ప్రస్తుత ఆపత్కాల‌ పరిస్థితుల్లో ప్రభుత్వానికి అండగా నిలిచేందుకు ముందుకు వచ్చిన ఎల్లారెడ్డి నియోజకవర్గం జెడ్పీటీసీలు, ఎంపీటీసీలను మాజీ ఎంపీ కవిత అభినందించారు. ప్రతి ఒక్కరూ స్వీయ నిర్బంధంలో ఉండి కరోనాను నియంత్రించడానికి తోడ్పాటును అందించాలని మాజీ ఎంపీ కవిత కోరారు. ప్రజలంతా సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించాలని మాజీ ఎంపీ కవిత విజ్ఞప్తి చేశారు. అంతేకాదు, లాక్ డౌన్ ‌కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలు, వలస కూలీలకు వీలైనంత సహాయం చేయాలని ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే సురేందర్, స్థానిక ప్రజాప్రతినిధులకు మాజీ ఎంపీ కవిత విజ్ఞప్తి చేశారు.


logo