బుధవారం 03 జూన్ 2020
Telangana - May 04, 2020 , 18:50:05

రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు

రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు

మంచిర్యాల : యాసంగిలో పండించిన పంటను సత్వరమే కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. యాసంగి లో పండించిన పంట కొనుగోలు విషయంలో అనుసరించాల్సిన విధానం పై సోమ‌వారం మంచిర్యాల జిల్లా నస్పూర్ లోని సింగరేణి అతిథిగృహంలో జరిగిన సమీక్షా సమావేశానికి మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లాలో జరుగుతున్న ధాన్యం సేకరణపై ప్ర‌జాప్ర‌తినిదులు, అధికారులు, రైస్ మిల్ల‌ర్స్ తో చ‌ర్చించారు. 

ఈ సంద‌ర్బంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీయార్ ఆదేశాల ప్రకారం రైతుల నుండి ప్రతి ధాన్యం గింజను  కొనుగోలు చేసేలా అధికారులు ఏర్పాట్లు చేయాల‌న్నారు. జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారుల‌ను ఆదేశించారు.

రాష్ట్ర ప్రభుత్వం సాగు కోసం నీటి లభ్యత, నిరంతర విద్యుత్ అందించడంతో వరి ధాన్యం దిగుబడి మంచిర్యాల జిల్లాలో రెండు లక్షల మెట్రిక్ టన్నుల వరకు వచ్చిందని మంత్రి తెలిపారు. మొక్కజొన్న, ప్రత్తి పంటల దిగుబడి కూడా పెరిగిందన్నారు. పంటల దిగుబడికి తగినట్లుగా పలు శాఖల అధికారులు సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేయాల‌ని సూచించారు. 

మే నెల 31 వ తేదీలోగా నిర్దేశించిన లక్ష్యం మేరకు జిల్లాలో ధాన్యం కొనుగోలు పూర్తి చేయాల‌ని అధికారుల‌కు స్ప‌ష్టం చేశారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించేందుకు, నిలువ చేసేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాల‌న్నారు.  పంట కొనుగోలుపై రైతులు ఎలాంటి ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని, పండిన ప్ర‌తి గింజను కొనుగోలు చేసే విధంగా ప్ర‌భుత్వం అన్ని చ‌ర్య‌లు తీసుకుంద‌ని స్ప‌ష్టం చేశారు.  మ‌రోవైపు గత వారం రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక్క కరోనా కేసు నమోదు కాలేదు, అయినా కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నామ‌ని చెప్పారు.  లాక్ డౌన్ పూర్తి అయ్యే వరకు ప్రజలు స్వీయ నిర్బంధంలో ఉండాలని సూచించారు.

ఈ స‌మావేశంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మీ, ఎంపీ వెంకటేష్ నేత, ఎమ్మెల్సీ పురాణం సతీష్,ఎమ్మెల్యేలు దివాకర్ రావు, దుర్గం చిన్నయ్య, బాల్క సుమన్, కలెక్టర్ భారతి హోళికేరి, DCMS చైర్మన్ తిప్ప‌ని లింగయ్య, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కాంతయ్య, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


logo