శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 01, 2020 , 22:43:10

వనభోజనం కాదు.. పశు వైద్యసేవలో పగటిభోజనం

వనభోజనం కాదు.. పశు వైద్యసేవలో పగటిభోజనం

వరంగల్‌ : వనభోజనం కాదు వీళ్లు చేస్తున్నది.. సంచార పశువైద్యసేవలో భాగంగా చెట్టుకింద పగటి బువ్వతింటున్నరు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రం శివారులో ఒక చెట్టు కింద సంచార పశువైద్యశాల(1962) విధులు నిర్వర్తించి మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. వెటర్నరీ డాక్టర్‌ సౌమ్య, ప్యారావెట్‌ రోజా కుమారి, హెల్పర్‌, కెప్టెన్‌ (వాహన డ్రైవర్‌ని కెప్టెన్‌ అని పిలుస్తారు) ఈ నలుగురు.. టోల్‌ఫ్రీ నెంబర్‌ 1962కి వచ్చిన కాల్స్‌ ప్రకారం జిల్లాలో తిరుగుతూ పశువులకు వైద్యం నిర్వర్తిస్తూ గతంలో ఆయా గ్రామాల్లోనే భోజనాలు చేసేవారు. ఈ బృందానికి కావాల్సిన మంచినీళ్లు సహా ఇతర సౌకర్యాలు అందుబాటులో ఉండేవి. 

అయితే కరోనా నేపథ్యంలో ఊళ్లల్లో కూర్చొని తినే పరిస్థితి లేదు. దీంతో ఉదయం విధుల్లోకి వచ్చే సమయంలోనే ఇంటి నుంచి టిఫిన్‌, వాటర్‌ బాటిళ్లు తీసుకొని వచ్చి మధ్యాహ్నం ఎక్కడ తీరిక దొరికితే అక్కడ ఇలా భోజనం చేస్తున్నారు. ఉదయం ఏడు గంటల నుంచి మూడు గంటల దాకా (కాల్స్‌ని బట్టి సమయంలో మార్పులు ఉండే అవకాశం ఉంది) విధులు నిర్వర్తిస్తున్నారు. పశువులకు కావాల్సిన మందులు అందించి రైతులకు అవసరమైన సూచనలు చేసి, ఒకవేళ ఏవైనా శస్త్ర చికిత్సలు అవసరమైతే చేసి రావడం వీరి విధి. ఈ మధ్యకాలంలో పశువులకు ఎక్కువగా పుండ్లు వస్తున్నాయని ప్యారావేట్‌ రోజాకుమారి తెలిపారు. 


logo