శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 01, 2020 , 21:46:40

భూతగాదాలు.. పొలంలో ఈడ్చుకెళ్లి ఉరేసేందుకు యత్నం

భూతగాదాలు.. పొలంలో ఈడ్చుకెళ్లి ఉరేసేందుకు యత్నం

నాగర్‌కర్నూల్‌ : జిల్లాలోని తూడుకుర్తి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. భూతగాదాల కారణంగా అన్నదమ్ముల మధ్య వివాదం చెలరేగి తమ్ముడిపై అన్న కుటుంబ సభ్యులు దాడిచేశారు. కాళ్లు చేతులు కట్టివేసి వ్యవసాయ పొలంలో ఈడ్చుకెళ్లి చెట్టుకు కట్టేసి కొట్టడమే కాకుండా ఉరేసేందుకు యత్నించిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. 

ఎస్సై మాధవరెడ్డి తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన తిరుపతయ్య, కుర్మయ్య అన్నదమ్ములు. వీరద్దరి మధ్య గత కొద్ది రోజుల నుంచి భూతగాదాలు చోటు చేసుకుంటున్నాయి. గత నెల 29వ తేదీన పొలం దున్నడానికి వెళ్లిన తిరుపతయ్యపై పథకం ప్రకారం అన్న కుర్మయ్య, అతని కుటుంబ సభ్యులు దాడి చేశారు. కాళ్లు చేతులను తాళ్లతో కట్టివేసి మడికెట్లలో కిరాతకంగా ఈడ్చుకుంటూ వెళ్లి చెట్టుకు కట్టేసి చంపడానికి యత్నించారని ఎస్సై పేర్కొన్నారు. 

ఈ ఘటనను తిరుపతయ్య కుమారుడు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించినప్పటికీ ఆలస్యంగా బయటపడింది. బాధితుడి ఫిర్యాదు మేరకు తూడుకుర్తి గ్రామానికి చేరుకొని విచారించమని ఎస్సై తెలిపారు. దాడిచేసిన కుర్మయ్య, అతని భార్య శేషమ్మ, కుమారుడు అనిల్‌కుమార్‌, కూతురు అనితపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.


logo