గురువారం 28 మే 2020
Telangana - Apr 30, 2020 , 15:19:12

హరితహారంతోనే రాష్ట్రంలో సకాలంలో వర్షాలు

హరితహారంతోనే రాష్ట్రంలో సకాలంలో వర్షాలు

కరీంనగర్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమంతో రాష్ట్రంలో సకాలంలో వర్షాలు పడుతున్నాయని ఎమ్మెల్యే రవిశంకర్ పేర్కొన్నారు. మండలంలోని వెదురుగట్టలో అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీని ఆయన సందర్శించారు. నర్సరీలో మొక్కల పెంపక విధానము, ఎదుగుదలను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. 

ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణితో ఎదిగిన చెట్లను విచ్చలవిడిగా నరికి వేయడంతోనే ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయన్నారు. సకాలంలో వర్షాలు కురవక, ఆక్సిజన్ కూడా కొనుక్కునే దౌర్భాగ్య స్థితిని కొని తెచ్చిన ఘనత గత ప్రభుత్వాలు దక్కుతుందని ఆయన ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మొదటి వారంలోనే తెలంగాణను హరిత తెలంగాణగా మార్చాలనే దృఢ సంకల్పంతో హరితహారంను ప్రారంభించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుంది అని కొనియాడారు. 

గత ఆరేళ్లుగా నిర్వహిస్తున్న హరితహారంలో కోట్లాది మొక్కలు నాటామని, నాటిన మొక్కలను సంరక్షించడంతోనే నేడు సకాలంలో వర్షాలు కురుస్తున్నాయి అని పేర్కొన్నారు. జిల్లాల పునర్విభజన అనంతరం కరీంనగర్ జిల్లాలో అటవీ ప్రాంతాలుగా చెట్లను పెంచాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకు వెదురుగట్టలో గత సంవత్సరం నిర్వహించిన హరితహారంలో 175 ఎకరాలలో 67,000 మొక్కలు నాటమని పేర్కొన్నారు. 

ఈ ప్రాంతంలో నాటిన మొక్కలను నాటి వదిలేయకుండా వాటిని సంరక్షించడంతోనే ఈ ప్రాంతం అటవీ ప్రాంతంగా మారిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయసాధనకు అనుగుణంగా మొక్కలను సంరక్షించిన అధికారులను ఆయన అభినందించారు. నియోజకవర్గంలోని వరద కాలువ, చెరువులు, తదితర ప్రాంతాలలో అటవీశాఖ అధికారులు సర్వే చేపట్టి మొక్కల పెంపకాన్ని చేపట్టాలని పేర్కొన్నారు. గ్రామాలలో ఉన్న దేవాలయాల చుట్టూ వేప చెట్లు, తుమ్మ చెట్లు నాటించాలని అన్నారు. 

ఈ ఏడాది నిర్వహించే హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జిల్లా అటవీ శాఖ అధికారి ఆయాస, ఎఫ్ఆర్వో శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, ఎంపీపీ చిలుక రవి, సింగిల్ విండో చైర్మన్ వెల్ మల్లారెడ్డి, ఎఫ్ఎస్ఓ వేణు, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు అజయ్ కుమార్, టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.


logo