శుక్రవారం 05 జూన్ 2020
Telangana - Apr 30, 2020 , 14:40:23

ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది : పువ్వాడ

ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది : పువ్వాడ

ఖమ్మం : రైతులు అధైర్య పడవవద్దని ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని మదుఖాన్ షుగర్స్ అండ్ పవర్ ఇండస్ట్రీస్ లోని గోడౌన్ ను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మదుఖాన్ షుగర్స్ ప్యాక్టరీలో 7 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోడౌన్ సిద్ధంగా ఉందన్నారు. ఏ మండలంలోని మొక్కజొన్నలు ఆయా మండలాల్లోనే నిల్వ ఉంచేందుకు జిన్నింగ్ మిల్లులను పరిశీలించామన్నారు. 2 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలు లక్ష్యంగా పెట్టుకుంటే అదనంగా మరో లక్ష మెట్రిక్ టన్నులు వచ్చే అవకాశం ఉందన్నారు.

రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గోడౌన్ లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రైతులు ఆందోళన చెందనవసరం లేదన్నారు. ఈ సీజన్ లో 2.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందనుకుంటే అదనంగా 3.5 లక్షల వచ్చిందన్నారు. ధాన్యం విక్రయించిన రైతులకు ఇప్పటికే రూ. 80 కోట్లు చెల్లించాలన్నారు. కొనుగోలు కేంద్రంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీచుకుంటున్నామన్నారు. ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని రైతులకు మంత్రి పువ్వాడ అజయ్ సూచించారు. ఈ కార్యక్రమంలో కలక్టర్ ఆర్వీ కర్ణన్, జడ్పీ చైర్మన్ లింగాల కకమల్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.


logo