గురువారం 04 జూన్ 2020
Telangana - Apr 10, 2020 , 01:24:14

లాక్‌డౌన్‌తో తగ్గిన కేసులు

లాక్‌డౌన్‌తో తగ్గిన కేసులు

  • తాజాగా 18 మందికి పాజిటివ్‌ 
  • రెండురోజుల్లో 70 మంది డిశ్చార్జి
  • మంత్రి ఈటల రాజేందర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణలో లాక్‌డౌన్‌ను పటిష్ఠంగా అమలుచేస్తుండటంతోనే కరోనా పాజిటివ్‌ కేసుల నమోదు తగ్గుతున్నదని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు గురువారం కోఠిలోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్లో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో గురువారం 18 కేసులు నమోదయ్యాయని చెప్పారు. 665 శాంపిల్స్‌లో 18 మందికి పాజిటివ్‌ వచ్చినట్టు తెలిపారు. పాజిటివ్‌  కేసులు వచ్చిన 101 ప్రాంతాలను (హాట్‌ స్పాట్‌) గుర్తించామని,  వాటి పరిధిలోని  ప్రజలు బయటికి రాకుండా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. పాజిటివ్‌తో దవాఖానల్లో ఉన్నవారంతా కోలుకుంటున్నారని, రెండ్రోజుల్లో మరో 70 మంది డిశ్చార్జి అయ్యే అవకాశం ఉన్నదని, మిగతా వారు ఈనెల 22 వరకు కోలుకుంటారని చెప్పారు. రేపట్నుంచి తెలంగాణలో కేసులు తగ్గే అవకాశం ఉన్నదని, సీఎం కేసీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు అధికశాతం ప్రజలు ఆచరిస్తున్నందువల్లే కేసులు తగ్గుతున్నాయని వివరించారు. పాజిటివ్‌ కేసులు తగ్గినా కూడా ఎక్కడా రిలాక్స్‌ కావద్దని సీఎం సూచించారని, ఇందుకు అనుగుణంగానే వైద్య విభాగాలు అప్రమత్తంగా పనిచేస్తున్నాయని తెలిపారు. కరోనా వైద్యం కోసం వెయ్యి వెంటిలేటర్లు ఆర్డర్‌ ఇచ్చామని, ఆరోగ్యశాఖ చరిత్రలోనే మొదటిసారి పెద్దఎత్తున వైద్య పరికరాలను కొంటున్నట్టు మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం 414 మంది పాజిటివ్‌ వ్యక్తులకు గాంధీ, చెస్ట్‌, కింగ్‌ కోఠి దవాఖానల్లో వైద్య చికిత్స అందిస్తున్నామని, ఇకపై గాంధీ దవాఖానలో కరోనా పాజిటివ్‌ వ్యక్తులకే చికిత్స అందిస్తామని వెల్లడించారు. జలుబు, దగ్గు, జ్వరం వంటి కరోనా అనుమానిత లక్షణాలున్నవాళ్లు కింగ్‌కోఠి దవాఖానలో పరీక్ష చేయించుకోవాలని సూచించారు. ఇతర వ్యాధిగ్రస్థుల పరిస్థితిపై  దృష్టి సారించామని, కిడ్నీ డయాలిసిస్‌ అవసరమైన వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేశామని చెప్పారు. తలసేమియా రోగులకు అత్యవసరంగా రక్తం అవసరమని, రక్తం ఇచ్చేవాళ్లు 108, 104కు ఫోన్‌చేసి రక్తదానంచేయాలని మంత్రి ఈటల సూచించారు.


logo