బుధవారం 03 జూన్ 2020
Telangana - Mar 30, 2020 , 00:31:53

కట్టుదిట్టంగా క్వారంటైన్‌

కట్టుదిట్టంగా క్వారంటైన్‌

  • ఢిల్లీకి వెళ్లొచ్చిన వారికి పరీక్షలు
  • స్థానిక ఐసోలేషన్‌కు తరలింపు
  • గాంధీకి చేరిన 9మంది మెదక్‌ జిల్లా వాసులు  

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌ : కరోనా వైరస్‌ కట్టడికి ప్రభుత్వం క్వారంటైన్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్నది. విదేశాల నుంచి వచ్చిన వారితోపాటు ఇతర రాష్ర్టాలకు వెళ్లొచ్చిన వారిపైనా నిఘా వేస్తున్నది.ఇటీవల ఢిల్లీకి వెళ్లొచ్చిన పలు జిల్లాలవారికి ఆదివారం పరీక్షలు నిర్వహించి స్థానికంగా ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ వార్డులకు తరలించింది. వారి కుటుంబ సభ్యులకు సైతం పరీక్షలు చేయనున్నది. 

పలు జిల్లాల నుంచి..  

నిజామాబాద్‌ జిల్లాకేంద్రానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ రావడంతో ఆయనతోపాటు ఢిల్లీకి వెళ్లి ఈనెల 22న తిరిగి వచ్చిన, సన్నిహితంగా ఉన్నవారిని అధికారులు గుర్తించారు. కొందరిని క్వారంటైన్‌కు, మరికొందరిని హైదరాబాద్‌కు తరలించారు. నిర్మల్‌ జిల్లాలోని ఖానాపూర్‌ నుంచి ఆరుగురు, భైంసా నుంచి 12 మంది, దిలావర్‌పూర్‌ నుంచి 9 మంది వెళ్లినట్టు గుర్తించారు. వారందరికీ స్థానిక అధికారులు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. నిర్మల్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌కు తరలించారు. ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండ మండలానికి చెందిన ఒకరిని ఆదిలాబాద్‌ రిమ్స్‌లోని ఐసోలేషన్‌ వార్డులో చేర్పించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజన్‌కు చెందిన ఇద్దరు, కామారెడ్డి మండలానికి చెందిన ఇద్దరికి కరోనా లక్షణాలు కనిపించడంతో జిల్లా కేంద్ర దవాఖానలో పరీక్షలు చేసి అనంతరం హైదరాబాద్‌లోని గాంధీ దవాఖానకు తరలించారు. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌కు చెందిన ఐదుగురు, రెంజల్‌ మండలానికి చెందిన ఒకరు, ఎడపల్లి మండలానికి చెందిన ఇద్దరు, మోస్రా మండలానికి చెందిన 9 మంది, మాక్లూర్‌ వాసులు ముగ్గురు, సిరికొండకు చెందిన ఒకరు, బాల్కొండ వాసులు ఇద్దరిని అధికారులు గుర్తించారు. వీరిలో కొందరు ఇటీవల ఢిల్లీకి వెళ్లిరాగా, మరికొందరు వారితో సన్నిహితంగా ఉండటంతో వీరందరినీ అధికారులు గుర్తించి హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు.  

మెదక్‌ జిల్లా వాసులు సైతం..

మెదక్‌ జిల్లాకు చెందిన 9 మంది ఢిల్లీకి వెళ్లిరాగా.. అధికారులు హోం క్వారంటైన్‌లో ఉంచారు. మెదక్‌కు చెందిన నలుగురు, పాపన్నపేట, శివ్వంపేట, చేగుంట, కొల్చారానికి చెందిన ఒక్కొక్కరితోపాటు       మరో వ్యక్తిని పరీక్షల నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించినట్టు జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్‌ వెంకటేశ్వర్లు తెలిపారు. అలాగే ఈ నెల 13న మహబూబాబాద్‌ జిల్లా నుంచి వెళ్లిన ముగ్గురు 18న జిల్లాకు చేరుకున్నారు. మహబూబాబాద్‌ పట్టణానికి చెందిన ఒకరు, తొర్రూరుకు చెందిన ఇద్దరికి కరోనా లక్షణాలున్నాయన్న అనుమానంతో అధికారులు శనివారం అర్ధరాత్రి మహబూబాబాద్‌ జిల్లా దవాఖానలోని ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు. వారి నుంచి నమూనాలను సేకరించి హైదరాబాద్‌కు పంపించారు. అదే విధంగా మహబూబాబాద్‌ పట్టణానికి చెందిన మరో వ్యక్తి ప్రస్తుతం ఖమ్మం పట్టణంలో ఉంటున్నాడు. అతడిని కూడా ఖమ్మం దవాఖానలోని ఐసోలేషన్‌ వార్డుకు తరలించి నమూనాలను హైదరాబాద్‌కు తరలించినట్టు జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్‌ శ్రీరాం చెప్పారు.  

ఎన్‌ఆర్‌ఐలకు జియోట్యాగింగ్‌ 

వరంగల్‌ అర్బన్‌ జిల్లా కమలాపూర్‌ మండలంలోని కమలాపూర్‌, గూడూరు, కానిపర్తి, శనిగరం, శ్రీరాంలపల్లి, మర్రిపెల్లి గ్రామాలకు వచ్చిన ఎన్‌ఆర్‌ఐలకు ఆదివారం జియోట్యాగింగ్‌ చేశారు. మొత్తం ఆరుగురికి జియోట్యాగింగ్‌ చేసి వారి కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా వేస్తున్నట్టు స్థానిక వైద్యాధికారి డాక్టర్‌ సంయుక్త తెలిపారు. పదిహేను రోజుల వరకు ఇండ్లలోనే ఉండాలని వారికి సూచించినట్టు డాక్టర్‌ పేర్కొన్నారు.


logo