సోమవారం 30 మార్చి 2020
Telangana - Mar 16, 2020 , 21:00:08

కరోనా దుష్ప్రచారాలపై ఫిర్యాదు చేయవచ్చు

కరోనా దుష్ప్రచారాలపై ఫిర్యాదు చేయవచ్చు

మహబూబ్‌ నగర్‌ : కరోనా వైరస్‌ సోకిందంటూ తప్పుడు సమాచారం ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. మహబూబ్‌ నగర్‌ పట్టణంలో ఒకరికి కరోనా సోకిందంటూ వాట్సప్‌లో కొందరు ప్రచారం చేశారు. దీనిపై జిల్లా జనరల్‌ దవాఖాన సూపరింటెండెంట్‌ స్పష్టతనిచ్చారు. మహబూబ్‌ నగర్‌ జనరల్‌ దవాఖానకు కరోనా అనుమానిత కేసు వచ్చినట్లు సోషల్‌ మీడియాలో వదంతులు వ్యాప్తి చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆయన తెలిపారు. ఇవన్నీ వదంతులని, ఎవరికీ కరోనా సోకలేదని ఆయన తెలిపారు.

దగ్గు, జ్వరం ఉంటే కరోనా వచ్చినట్లు భావించరాదని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేసిన వారిపై చట్టరీత్యా చర్య తీసుకుంటామని తెలిపారు. మరో వైపు ఈ అంశంపై జిల్లా పాలనా యంత్రాంగం సైతం ఏర్పాట్లు చేసింది. కరోనాపై వదంతులు ప్రచారం చేస్తే జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలోని కంట్రోల్‌ రూం నెం. 08542-241165కు ఫిర్యాదు చేయాలని కలెక్టర్‌ వెంకట్రావు తెలిపారు. వదంతుల వల్ల జనం భయాభ్రాంతులకు గురవుతారని ఆయన అన్నారు. వాట్సప్‌, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ తదితర సామాజిక మాధ్యమాల్లో కరోనాపై వదంతులు ప్రచారం చేస్తే చర్యలు తప్పవన్నారు. 

యువతికి కరోనా లేదని నిర్ధారించిన గాంధీ వైద్యులు

పాలమూరు జిల్లా కేంద్రానికి చెందిన ఓ యువతికి కరోనా లక్షణాలున్నాయని సోషల్‌ మీడియాల్లో ప్రచారమైంది. యువతికి కరోనా వైరస్‌ సోకలేదని సాధారణ జ్వరమని గాంధీ వైద్యులు పరీక్షలు నిర్వహించి సోమవారం నిర్ధారించారు. వెంటనే ఆ యువతిని మహబూబ్‌నగర్‌లోని ఆమె ఇంటికి తరలించారు. ఆ యువతికి వైరస్‌ ఏమీ సోకలేదని, ఆమె ఇంట్లోనే ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.

 పాలమూరు జిల్లా కేంద్రంలోని ప్రేమ్‌నగర్‌కు చెందిన ఆ యువతి హైదరాబాద్‌లోని బీఎస్సీ నర్సింగ్‌ చేస్తోంది. గత శనివారం ఆమెకు జ్వరం వచ్చింది. వెంటనే వారు కుటుంబ సభ్యులు మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ జనరల్‌ దవాఖానలో వైద్యులను సంప్రదించారు. అయితే జ్వరం రావడంతో పాటు జలుబు చేయడంతో వారు పరీక్షించిన వైద్యులు వైద్యసేవల అందించి మందులు రాశారు. సోమవారం దవాఖానకు వైద్యసేవల కోసం యువతి ఆమె తల్లివెంట వచ్చి వైద్యులు సంప్రదించగా కరోనా లక్షణాలున్నాయని వైద్యాధికారులు  ప్రత్యేక వాహనంలో సూట్‌ వేసి హైదరాబాద్‌లోని గాంధీ దవాఖానకు అంబులెన్స్‌లో తరలించారు. 

హైదరాబాద్‌లోని వైద్యులు యువతిని వైద్యపరీక్షలు చేసి కరోనా వ్యాధి లేదని తెలిపారు. మహబూబ్‌నగర్‌కు తరలించారు. పాలమూరులో కరోనా అని ప్రజలను భయాభ్రాంతులకు గురిచేసిన వారిపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ రెమరాజేశ్వరి హెచ్చరించారు. పుకారు సృష్టించి సోషల్‌ మీడియాలో పెట్టిన వారిపై నిఘా ఉంచారు. తప్పుడు ప్రచారం చేయరాదని, ప్రచారం చేసే వాట్స్‌ప్‌, సోషల్‌ మీడియాలపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని పోలీసు అధికారులు హెచ్చరించారు. logo