సోమవారం 06 ఏప్రిల్ 2020
Telangana - Mar 16, 2020 , 01:11:40

జోరుగా కందుల కొనుగోళ్లు

జోరుగా కందుల కొనుగోళ్లు
  • 1,16,927 టన్నుల సేకరణ
  • అక్రమాలకు అడ్డుకట్ట ఎప్పటికప్పుడు విజిలెన్స్‌ తనిఖీలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రవ్యాప్తంగా కందుల కొనుగోలు జోరుగా సాగుతున్నది. నాఫెడ్‌ ఆధ్వర్యంలో మార్క్‌ఫెడ్‌ నోడల్‌ఏజెన్సీగా ఆదివారం వరకు 5,552 మంది రైతుల నుంచి రూ.678.18 కోట్ల విలువైన 1,16,927.60  టన్నుల కందులను అధికారులు కొనుగోలు చేశారు. రైతుల ముసుగులో దళారులు, వ్యాపారులు ధాన్యాన్ని విక్రయించకుండా అధికారులు మూడు విజిలెన్స్‌ బృందాలను ఏర్పాటుచేశారు. వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ ఆధ్వర్యంలో 123  కేంద్రాలద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకచర్యలు చేపట్టింది. కందిపంట సాగుచేసిన రైతుల పొలాలను వీఆర్వో, ఏఈవో పరిశీలించి ధ్రువపత్రాలను ఇవ్వాలని నిబంధన పెట్టింది. ఈ పత్రాల ఆధారంగానే సిబ్బంది కందులను కొనుగోలు చేయా లి. పత్రాలు లేకపోయినా కొన్నిచోట్ల కొనుగోళ్లు జరిపినట్టు విజిలెన్స్‌ అధికారులు గుర్తించారు. ఇందుకు సహకరించిన ఏడుగురు అధికారులను ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 10 కొనుగోలు కేంద్రాల ద్వారా రూ.64.48 కోట్ల విలువైన  11,119 టన్నులు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని 14 కొనుగోలు  కేం ద్రాల్లో రూ.87.20 కోట్ల విలువైన 14,133.90 టన్నులు, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 22 కొనుగోలు కేంద్రాల్లో రూ.154.26 కోట్ల విలువైన 26,595.90 టన్నులు, ఉమ్మడి వరంగ ల్‌ జిల్లాలో 8 కొనుగోలు కేంద్రాల్లో రూ.12.02  కోట్ల విలువైన  2074.05 టన్నులు, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని 8 కొనుగోలు కేంద్రాల్లో  రూ.11.96 కోట్లతో 2061.25 టన్నులు, ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని 15 కొనుగోలు కేంద్రాల్లో రూ.43.02 కోట్లతో 7415.85 టన్నులు, ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని 13 కొనుగోలు కేంద్రాల్లో 74.42 కోట్ల విలువైన 12,830.65 టన్నులు, ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని 24 కొనుగోలు కేంద్రాల్లో రూ.200.24 విలువైన 34,525.05 టన్నుల కందులను కొనుగోలు చేశారు.     


1.51 లక్షల టన్నుల కొనుగోలుకు అనుమతి: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి 

రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు పత్తి, కంది ఉత్పత్తులను కనీస మద్దతు ధరకు కేంద్రం కొనుగోలు చేస్తున్నదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని దిల్‌కుషా అతిథిగృహంలో మార్క్‌ఫెడ్‌, మార్కెటింగ్‌, నాఫెడ్‌, సీసీఐ అధికారులతో కందులు, పత్తి కొనుగోళ్లపై ఆయన సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో 1,51,625 టన్నుల కందుల కొనుగోలుకు కేంద్రం అనుమతిచ్చిందని, ఇప్పటివరకు 65 వేల టన్నుల కందులకు  రూ.266 కోట్లు మార్క్‌ఫెడ్‌కు చెల్లించినట్టు తెలిపారు. పత్తి కొనుగోలుకు సీసీఐ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి, రాష్ట్రంలో దాదాపు రూ.10,576కోట్ల విలువైన 20 లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేశామన్నారు. logo