మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 15, 2020 , 01:34:47

కరోనాతో ముప్పు లేదు

కరోనాతో ముప్పు లేదు
  • పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం
  • దేశంలో చనిపోయింది ఇద్దరే
  • అన్ని రాష్ట్రాలు అప్రమత్తం
  • విమానాశ్రయంలో 200 మంది వైద్య సిబ్బందిని ఏర్పాటు చేశాం
  • వైద్యారోగ్యశాఖ పనితీరు భేష్‌
  • అనవసర భయాలకు లోనుకావద్దు
  • ప్రభుత్వం అండగా ఉంటుంది
  • కరోనాపై స్వల్ప వ్యవధి చర్చలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు
  • దేశానికి పట్టిన అతిపెద్ద కరోనా.. కాంగ్రెస్‌పార్టీయేనని వ్యాఖ్య
హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ:కరోనా వైరస్‌వల్ల ఇప్పటికిప్పుడు మనకు ఎలాంటి ప్రమాదం లేదని, కానీ ముందుజాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత తమపై ఉన్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని తెలిపారు. అవసరమైతే రూ.5వేల కోట్లు కేటాయించైనా సరే.. అన్ని చర్యలు తీసుకొంటామని స్పష్టంచేశారు. కరోనా అంశాన్ని అత్యంత ప్రాధాన్యాంశంగా తీసుకొంటామని చెప్పారు. హైదరాబాద్‌.. దేశంలోనే అతిపెద్ద నగరాల్లో ఒకటిగా ఉండటం, వందల సంఖ్యలో విమానాలు, రైళ్లు, వాహనాల ద్వారా నిత్యం పెద్ద సంఖ్యలో దేశవిదేశ ప్రయాణికులు వస్తుండటంతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరమున్నదన్నారు. ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని స్పష్టంచేశారు. శనివారం శాసనసభలో కరోనా వైరస్‌పై స్వల్పకాలిక చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్‌ ప్రకటనచేశారు. దేశంలో ఇప్పటివరకు 83 మందికి కరోనా సోకిందని, వీరిలో ఇద్దరు చనిపోయారని, గాంధీ దవాఖానలో ఒకరికి విజయవంతంగా చికిత్సచేసి ఇంటికి పంపామని తెలిపారు. తాజాగా మరొకరికి పాజిటివ్‌ వచ్చిందని, గాంధీ దవాఖానలో చికిత్స నడుస్తున్నదని తెలిపారు. మరో ఇద్దరికి కరోనా లక్షణాలుంటే, పరీక్షల నిమిత్తం పుణెకు శాంపిల్స్‌ పంపించినట్లు వెల్లడించారు. ఈ వైరస్‌ వల్ల దేశంలో ఇప్పటివరకు ఇద్దరుమాత్రమే చనిపోయారని గుర్తుచేశారు. చైనా, దక్షిణ కొరియా, ఇరాన్‌, ఇటలీ, ఫ్రాన్స్‌ జర్మనీ, స్పెయిన్‌ దేశాల నుంచి విదేశీ ప్రయాణికులకు కేంద్రం వీసాలు రద్దుచేసిందని, ఈ దేశాల నుంచి మనదేశాలవారే వస్తే వారిని విమానాశ్రయంలోనే 14 రోజులపాటు క్వారంటైన్‌ చేసి నెగెటివ్‌ అని తేలితేనే బయటకు పంపించాలని కేంద్రం సూచించినట్లు వెల్లడించారు.  


వందేండ్లకో రోగం

ప్రతి వందేండ్లకు ఒకసారి ఒక వైరస్‌  ప్రపంచాన్ని గడగడలాడిస్తుందని సీఎం చెప్పారు. చరిత్రలో ఇలాంటి ఉదంతాలు చాలా ఉన్నాయని తెలిపారు. 1890లో స్పానిష్‌ ఫ్లూ వల్ల ప్రపంచంలో 10, 12 కోట్ల మంది చనిపోయారని, భారత్‌లో కోటి 4లక్షల మంది చనిపోయినట్లు లెక్కలు ఉన్నాయని గుర్తుచేశారు. నాడు ముంబై డాక్‌యార్డ్‌ నుంచి ఈ వైరస్‌ దేశంలో విస్తరించిందని పేర్కొన్నారు. 


రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి

వైరస్‌ నియంత్రణకు కేంద్రంతోపాటు అన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయని సీఎం కేసీఆర్‌ తెలిపారు. బెంగళూరులో మొత్తం షట్‌డౌన్‌ చేశారని, జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చి ముందస్తుచర్యలు తీసుకొంటున్నారన్నారు. గుమిగూడి వేడుకలు చేసుకోవటంవంటివి చేయవద్దని కేంద్ర ప్రభుత్వం సూచించిందన్నారు. మహారాష్ట్ర, ముంబై, పుణె ఇండస్ట్రియల్‌ టౌన్‌ మొత్తం మూసివేసినట్లు తెలిపారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత మన ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో రద్దీ బాగా పెరిగిందన్నారు. హైదరాబాద్‌ మెట్రో ద్వారా ప్రతి రోజు 4లక్షల మంది ప్రయాణం చేస్తున్నారని చెప్పారు. 2013-14లో 87 లక్షల మంది ప్రయాణికులు హైదరాబాద్‌కు వస్తే, ప్రస్తుతం 2.30 కోట్ల మంది ప్రయాణికులు వస్తున్నట్లు చెప్పారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు నాడు 23 వేల మంది ప్రయాణికులు వస్తే, నేడు 57వేల మంది ప్రయాణికులు వస్తున్నారని వెల్లడించారు. తెలంగాణ ఏర్పడకముందు 200 విమానాలు వస్తే,. ఇప్పుడు 500 పైగా విమానాలు వస్తున్నట్లు  చెప్పారు. తద్వారా హైదరాబాద్‌కు, రాష్ట్రానికి అంతర్జాతీయ అనుసంధానం పెరిగిందన్నారు. చాలాదేశాల నుంచి మనకు డైరెక్టుగా విమానాలు ఉన్నప్పటికీ ప్రధానంగా కరోనా బాధిత ప్రధాన దేశాలనుంచి మనకు నేరుగా విమానాలు లేకపోవడం అదృష్టమన్నారు. కరోనాకు సంబంధించి ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వంతో అనుసంధానించుకొంటూ చర్యలు తీసుకొంటున్నామని తెలిపారు.


ప్రతిదాన్నీ రాజకీయం చేయొద్దు

అసెంబ్లీలో చర్చ సందర్భంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కరోనాను అరికట్టడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తుచర్యలు తీసుకోలేదని, నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ చేసిన వ్యాఖ్యలను సీఎం తీవ్రంగా తప్పుబట్టారు. కొందరు వ్యక్తులు ప్రతి అంశాన్ని రాజకీయంచేయాలని చూస్తారని.. అది వారి ఖర్మకే వదిలేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏమీచేయడంలేదని భట్టి విక్రమార్క దుర్మార్గమైన స్టేట్‌మెంట్‌ ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశాన్ని, రాష్ర్టాన్ని నడిపేవాళ్లు బాధ్యతతో వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. ‘ప్రజలను భయభ్రాంతులకు గురిచేయకుండా పనులు ఎట్ల చేయాల్నో అట్ల చేస్తరు. కేంద్ర ప్రభుత్వం కరోనాను అడ్డుకొనేందుకు చాలా తీవ్రంగా కృషిచేస్తున్నది. దాదాపు వంద రకాల చర్యలు తీసుకొన్నారు. సడన్‌గా అన్ని బంద్‌చేయాలంటే.. దేశంలో ఎంత కన్‌ప్యూజన్‌ ఉంటది. ప్రజల్లో ఎంత ఆందోళన నెలకొంటుంది.. ప్రతిపక్షంలో కూర్చుని అడ్డం పొడుగు మాట్లాడొచ్చు.. నోరుంది కదా అని మాట్లాడటం కాదు. ఒక్కోచర్య దశలవారీగా చేయాల్సి ఉంటది’ అని చెప్పారు.  

 

కెనడా ప్రధాని భార్యకూ కరోనా వచ్చింది 

కెనడా ప్రధానమంత్రి భార్యకు కూడా కరోనా వచ్చిందని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ప్రధాని భార్యకే వచ్చిందంటే దేశమంతా బెంబేలెత్తుతారని ఐదురోజుల వరకు ఈ విషయం బయటపెట్టలేదన్నారు. తర్వాత కెనడా ప్రధాని స్వయంగా ఆ విషయం వెల్లడించి తనను తాను క్వారంటైన్‌ చేసుకొంటున్నట్టు ప్రకటించారని వెల్లడించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పుడు అనుసరించే విధానం అట్లా ఉంటుందని పేర్కొన్నారు. మనదగ్గర మాత్రం ప్రతిదీ రాజకీయమేనని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘కరోనా విషయంలో కూడా రాజకీయాలు చేయాలా? ఇంకా చాలా అంశాలున్నాయి. వాటిని చేసుకోవచ్చు? క్యాబినెట్‌ సమావేశంలో చర్చించిన తర్వాత అన్ని విషయాలు వెల్లడిస్తామని చెప్పినతర్వాత కూడా దీన్ని రాజకీయంచేస్తున్నారు. శవాల మీద పేలాలు ఏరుకొనేలాచేసే రాజకీయాలు సమాజానికి మంచిది కాదు. సమస్యను జటిలం చేసి, పబ్లిక్‌ను కన్‌ప్యూజ్‌చేసి ఆగమాగం చేయొద్దు. ఎవరో చిల్లర టీవీగాళ్లుచేసే ప్రచారాన్ని నమ్మొద్దు. ప్రజలను అనవసరంగా ఆందోళనపరచవద్దు. ప్రజలకు ధైర్యం చెప్దాం’ అని కాంగ్రెస్‌పార్టీకి సీఎం హితవు చెప్పారు.  


చిత్తశుద్ధితో పనిచేస్తాం

కేంద్ర ప్రభుత్వంతోపాటు ఈ పార్టీ ప్రభుత్వం.. ఆ పార్టీ ప్రభుత్వం అన్నది తేడా లేకుండా అన్ని రాష్ర్టాలు కరోనాపట్ల అప్రమత్తంగానే ఉన్నాయని సీఎం కేసీఆర్‌ అన్నారు. ‘ కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న రాజస్థాన్‌లో ఇద్దరు చనిపోయిండ్రు కాబట్టి రాజస్థాన్‌ ప్రభుత్వాన్ని బద్నాం చేయలేం కదా.. దేశంలోని అన్ని ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా పనిచేస్తున్నాయి. చర్యలు తీసుకోవడం ఇప్పటికే ప్రారంభమైంది. అమెరికాలో ఎమర్జెన్సీ ప్రకటించే స్థాయిలో పరిస్థితి ఉన్నది. మన భారతదేశం అదృష్టవంతమైన దేశం. మనదగ్గర ఆ పరిస్థితులు లేవు. కరోనా అంశాన్ని రాజకీయం చేసుకోవడం ద్వారా కాంగ్రెస్‌పార్టీ పేరును కంపుచేసుకోవడం తప్ప.. వారికి వచ్చేదేమీ ఉండదు. అయినా కాంగ్రెస్‌ను  పట్టించుకోవద్దని ప్రజలే మాకు అవకాశం ఇచ్చిండ్రు. అందుకే మేం వీళ్లను పట్టించుకోం. మేం మా కర్తవ్యాన్ని వందశాతం చిత్తశుద్ధితో చేస్తాం’ అని సీఎం అన్నారు. 


కాంగ్రెస్‌.. దేశానికి పట్టిన కరోనా 

‘నేను మొన్న సభలో మాట్లాడుతూ ఇది భయోత్పాతానికి గురికావాల్సిన అంశమేమీ కాదు. కొంత ఉష్ణోగ్రత దాటిన తర్వాత ఈ వైరస్‌ బతుకదు. దీనికి ప్రపంచవ్యాప్తంగా మందులేదు. మామూలు జ్వరానికి పారాసిటమాల్‌ వేసుకుంటే ఎలా పోతదో.. ఇది కూడా అట్లనే పోతది అని ఒక శాస్త్రవేత్త నాకు ఫోన్‌చేసి చెప్పిన విషయాన్ని నేను ఆన్‌రికార్డు సభలో చెప్పాను. దానిపైన విమర్శ చేసేందుకు భట్టి విక్రమార్క ఏదో ప్రయత్నంచేశారు. అసలు ఈ దేశానికి పట్టిన భయంకరమైన కరోనా.. కాంగ్రెస్‌పార్టీనే.. ఇప్పటికే దేశంలో కొన్నిచోట్ల ఇది వదిలింది. ఇంకకూడా వదులాల్సి ఉన్నది.’‘ఈ రాష్ర్టానికి, రాష్ట్ర ప్రజల మంచికోసం.. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు  ఏం చర్యలు తీసుకొంటే మంచి జరుగుతుందో అవి వందకు వంద శాతం తీసుకొంటాం. ప్రజలు అనవసరమైన భయాలకు లోనుకావద్దు. ప్రభుత్వం మీకు సంపూర్ణంగా అండదండగా ఉంటుంది. అన్ని చర్యలూ తీసుకొంటుంది. ప్రభుత్వం తరఫున నేను ప్రజలకు విజ్ఞప్తిచేస్తున్నా.. ఆరోగ్యశాఖతోపాటు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అన్ని జిల్లాల కలెక్టర్లు ఇచ్చే ఆదేశాలను ప్రజలంతా పాటించాలి. వ్యక్తిగత పరిశుభ్రతను ఎక్కువగా పాటించి.. కరోనా వ్యాధిబారిన పడకుండా ఉండాలని సలహా ఇస్తున్నా.’

- అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ 


రాజుగారి రాజ్యంలో గత్తర కథ 

కరోనాపై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్‌ రాజుగారి రాజ్యంలో గత్తర కథను చెప్పారు. ‘పూర్వం కలరాను గత్తర అనేటోళ్లు. ఓ రాజుగారి రాజ్యంలో గత్తర వచ్చింది. చానా చర్యలు తీసుకొన్నా తగ్గుతలేదు. గత్తరతోటి ఐదు మంది, పది మంది.. ఇరవై మంది.. ఇట్లా.. 50 మంది చనిపోతారు. దీనికి ఏం చేయాలా అని విచారిస్తే.. ‘ఒక భూతవైద్యుడు ఉన్నాడు. ఆయన్ని పిలిపిస్తే ఈ మహమ్మారిని తరిమికొడ్తడు’ అని ఒకాయన సలహా చెప్తడు. ఆ రాజు భూతవైద్యుడిని పిలిపిస్తారు. ఆ భూతవైద్యుడు ఊరి పొలిమేర వస్తుండగానే.. ఈ మహమ్మారి భయపడి పారిపోతుంటది. అప్పుడు ఆ భూతవైద్యుడు ‘ఏమే అన్యాయంగా 50 మందిని సంపితివి కదా’ అని ఆ మహమ్మారితో అంటడు. అప్పుడు ఆ మహమ్మారి.. ‘లేదన్నా.. నేను ఇమాన్‌దారీగా చెప్తున్నా.. నేను చంపింది ఐదుగురినే. మిగిలిన 45 ఆ ధగడుకే సచ్చిపోయిండ్రు’ అని చెప్పిందట. అంటే భయంతోనే ఎక్కువమంది చనిపోయిండ్రు’ అని సీఎం కేసీఆర్‌ చెప్పారు. 


అప్రమత్తంగా ఉన్నాం

కరోనాను ఎదుర్కొనేందుకు ముందుజాగ్రత్తగా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నదానిపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిపెట్టిందని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఇటలీ నుంచి వచ్చిన ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్‌ ఉంటే.. అతడికి గాంధీ దవాఖానలో వైద్యంచేయించి, నయమైన తర్వాత ఇంటికి కూడా పంపించామని పేర్కొన్నారు. ఈ అంశంలో ఆరోగ్యశాఖ అధికారులు పూర్తి అప్రమత్తతతో ఉన్నారన్నారు. 11 రోజులనుంచి ఆరోగ్యశాఖ మంత్రి పూర్తిగా ఈ పనిలోనే ఉన్నారని.. కొన్ని సందర్భాల్లో తనకు కూడా అందుబాటులో ఉండటంలేదని చెప్పారు. తర్వాత ఎక్కడున్నారని అడిగితే ఫలానాచోట ఫలానా అంశంపై సమీక్షలో ఉన్నామని, ఫలానా జరుగుతున్నదని చెప్తున్నారని సీఎం తెలిపారు. 200 మంది ఆరోగ్యశాఖ సిబ్బంది 24 గంటలపాటు శంషాబాద్‌ విమానాశ్రయంలో పనిచేస్తున్నారని, విదేశాలనుంచి వచ్చినవారికి కరోనా లక్షణాలు ఉంటే వారిని ఇతరులతో కలిపి ఉంచకుండా ఐసొలేటెడ్‌ ప్రాంతాలను ఎంపికచేసి పెట్టామని వివరించారు. దూలపల్లి ఫారెస్ట్‌ అకాడమీలో 150 గదులు సిద్ధం చేయాలని అధికారులకు చెప్పామని, వికారాబాద్‌ హరిత టూరిజం గెస్ట్‌హౌస్‌లో 30 సూట్లు ఉన్నాయని.. వాటిని కూడా సిద్ధంగా పెట్టుకొన్నామని వెల్లడించారు. ఇట్లా అనేక చర్యలు తీసుకొంటున్నామని.. ఇవన్నీ చెప్పి ప్రజలను భయభ్రాంతులకు గురిచేయాలా? అని ప్రశ్నించారు. ‘ప్రజల్లో భయోత్పాతాన్ని క్రియేట్‌చేయలేం కదా.. విషయం బ్రాడ్‌గా ప్రజలకు చెప్పాలనుకొని చెప్పినం. అలా చెప్పడం మా కర్తవ్యం’ అని స్పష్టంచేశారు. 


logo
>>>>>>