గురువారం 09 ఏప్రిల్ 2020
Telangana - Mar 14, 2020 , 02:15:56

కొత్తగా ఆరు ఎయిర్‌పోర్టులు

కొత్తగా ఆరు ఎయిర్‌పోర్టులు
  • మూడు గ్రీన్‌ఫీల్డ్‌, మూడు బ్రౌన్‌ఫీల్డ్‌
  • త్వరలో వరంగల్‌ఎయిర్‌పోర్ట్‌ సేవలు
  • రాష్ట్రంలో ఐదు ఏరోస్పేస్‌ పార్కులు
  • ఏరోస్పేస్‌రంగానికి హైదరాబాద్‌ అనువు
  • అత్యంతవేగంగా తెలంగాణ అభివృద్ధి
  • వింగ్స్‌ ఇండియా-2020ప్రారంభోత్సవంలో ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో కొత్తగా ఆరు ఎయిర్‌పోర్టులు ఏర్పాటుచేయనున్నట్టు ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. అతిత్వరలో వరంగల్‌ ఎయిర్‌పోర్టు సేవలను ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. శుక్రవారం వింగ్స్‌ ఇండియా- 2020ను లాంఛనంగా ప్రారంభించిన అనంతరం మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. దేశంలోనే తెలంగాణ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నదని, 2018-19లో 14.9% జీఎస్డీపీ వృద్ధిరేటును నమోదుచేసుకున్నదని తెలిపారు. టీఎస్‌ఐపాస్‌ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందన్నారు. ప్రపంచనగరాలపై చేసిన సర్వేలో గత ఐదేండ్లుగా అత్యంత నివాసయోగ్యమైన నగరాల్లో హైదరాబాద్‌ ఒకటిగా ఉండటం గర్వకారణమని చెప్పారు. రాష్ట్రంలో ఏర్పాటుచేయనున్న ఆరు కొత్త ఎయిర్‌పోర్టులలో నిజామాబాద్‌ జిల్లా జక్రాన్‌పల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం, మహబూబ్‌నగర్‌ జిల్లా గుడిబండలో గ్రీన్‌ఫీల్డ్‌.. వరంగల్‌ జిల్లా మామునూరు, పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్‌, ఆదిలాబాద్‌లో బ్రౌన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టులకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఎయిర్‌పోర్ట్‌ ఆథారిటీ ఆఫ్‌ ఇండియా టెక్నో ఫీజబిలిటీపై అధ్యయనం చేసి నివేదిక తయారుచేసిందని పేర్కొన్నారు. వరంగల్‌లో పారిశ్రామికంగా, ఐటీపరంగా అనేక అవకాశాలున్నాయని, ఎయిర్‌పోర్టు సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. కేంద్ర పౌరవిమానయానశాఖ సహకారంతో ఇక్కడి విమానాశ్రయాన్ని బీదర్‌ తరహాలో నిర్వహిస్తామన్నారు. ఉడాన్‌ స్కీంలో వరంగల్‌ విమానాశ్రయాన్ని చేర్చాలని కేంద్ర పౌరవిమానయానశాఖ అధికారులను కోరుతామని తెలిపారు. నిర్వహణ, మరమ్మతు, ఓవరాల్‌ (ఎమ్మార్వో) కేంద్రాల ఏర్పాటుకు తెలంగాణ అనువైన ప్రాంతమని చెప్పారు. ఇప్పటికే జీఎమ్మార్‌, ఎయిర్‌ఇండియా ఎమ్మార్వో కేంద్రాలు ఉన్నాయని, వీటిద్వారా తెలంగాణకు మంచి పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. డ్రోన్‌ టెక్నాలజీని వాడుతున్న రాష్ట్రం తెలంగాణ అని.. వ్యవసాయం, వైద్యం, మైనింగ్‌శాఖల్లో డ్రోన్లను వినియోగిస్తున్నట్టు తెలిపారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌లో రాష్ట్రం మొదటిస్థానంలో ఉన్నదని చెప్పారు.


ఏరోస్పేస్‌ రంగానికి అనువైన వేదిక

వింగ్స్‌ఇండియా ఏషియాలోనే అతిపెద్ద ఎయిర్‌షో అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఏరోస్పేస్‌, ఏవియేషన్‌ రంగానికి హైదరాబాద్‌లో అనువైన వాతావరణం ఉన్నదని చెప్పారు. కరోనాతో సదస్సు రద్దయ్యే అవకాశాలున్నప్పటికీ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకొన్నారని ప్రశంసించారు. ఏటీఎఫ్‌పై వ్యాట్‌ను 16 నుంచి 1 శాతానికి తగ్గించామని, ఇది ఏవియేషన్‌ పరిశ్రమకు ప్రోత్సాహకరంగా ఉంటుందని పేర్కొన్నారు. హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ ఉత్తమ ఎయిర్‌పోర్ట్‌గా అవార్డు గెలుచుకున్నదని తెలిపారు. లాక్‌హీడ్‌ మార్టిన్‌, జీఈ, సఫ్రాన్‌, రాఫెల్‌, ఎల్‌బిట్‌ వంటి విదేశీ కంపెనీలతోపాటు, అదాని, కల్యాణి వంటి దేశీయకంపెనీలు హైదరాబాద్‌లో యూనిట్లను స్థాపించాయని చెప్పారు. టాటా గ్రూప్‌ 90% ఏరోస్పేస్‌ ఉత్పత్తులను ఇక్కడే తయారుచేస్తున్నదని అన్నారు. ఏరోస్పేస్‌ రంగంలో 25 భారీ, వెయ్యి ఎమ్మెస్‌ఎంఈ పరిశ్రమలు నగరంలో ఉన్నాయని తెలిపారు. ఏరోస్పేస్‌ రంగంకోసం ప్రత్యేకంగా పారిశ్రామిక పార్కులను ఏర్పాటుచేశామని, 50 జనరల్‌ ఇంజినీరింగ్‌ పార్కుల్లో ప్రిసిషన్‌ ఇండస్ట్రీ, ఆదిభట్ల ఏరోస్పేస్‌ సెజ్‌, నాదర్‌గుల్‌, జీఎమ్మార్‌ ఏరోస్పేస్‌ పార్క్‌, అదానీ ఏరోస్పేస్‌ పార్క్‌, రెండు హార్డ్‌వేర్‌పార్క్‌లను ఏర్పాటుచేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఎగ్జిబిటర్‌ డైరెక్టరీ, నాలెడ్జ్‌ పేపర్‌ను మంత్రి కేటీఆర్‌ విడుదల చేశారు. 


తెలంగాణ సేవలకు అవార్డు

వింగ్స్‌ ఇండియా-2020 సందర్భంగా శుక్రవారం హోటల్‌ తాజ్‌కృష్ణాలో పౌర విమానయానరంగంలో అందించిన సేవలకు అవార్డులను మంత్రి కేటీఆర్‌ అందజేశారు.  ఏరోస్పేస్‌ రంగంలో చేస్తున్న కృషికి తెలంగాణ రాష్ట్రం స్పెషల్‌ క్యాటగిరీ అవార్డు దక్కించుకున్నది. 


మౌలిక సదుపాయాల విస్తరణకు విదేశీ రుణాలు:ఏఏఐ చైర్మన్‌ అర్వింద్‌ సింగ్‌

దేశంలో వైమానికరంగంలో మౌలిక సదుపాయాల విస్తరణ కోసం వచ్చే ఆర్థిక సంవత్సరంలో 300 మిలియన్‌ డాలర్ల విదేశీ రుణాలు (ఈసీబీ) తీసుకోనున్నట్టు ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) చైర్మన్‌ అర్వింద్‌సింగ్‌ వెల్లడించారు. ప్రస్తుతం దేశంలోని వైమానికరంగానికి ఏటా 34.5 కోట్ల మంది ప్రయాణికులకు సరిపోయే నిర్వహణ సామర్థ్యం ఉన్నదని.. దీనిని రెట్టింపు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఫిక్కీ సివిల్‌ ఏవియేషన్‌ కమిటీ చైర్మన్‌ అనంద్‌స్టాన్లీ మాట్లాడుతూ.. యూరప్‌లోని అనేక దేశాల కంటే తెలంగాణ జీడీపీ ఎంతో ఎక్కువగా ఉంటుందని తెలిపారు. తెలంగాణ ప్రగతిశీల రాష్ట్రంగా అభివర్ణించారు. కార్యక్రమంలో పుదుచ్చేరి పర్యాటక, పీడబ్ల్యూడీశాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు, కేంద్ర పౌరవిమానయానశాఖ కార్యదర్శి ప్రదీప్‌సింగ్‌ ఖరోలా, ఫిక్కీ జాతీయ అధ్యక్షురాలు సంగీతారెడ్డి, కేంద్ర పౌరవిమానయానశాఖ సంయుక్త కార్యదర్శి ఉష పాది తదితరులు పాల్గొన్నారు.


logo