శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 13, 2020 , 03:22:07

రక్షణ కంపెనీలతో ఉపాధి

రక్షణ కంపెనీలతో ఉపాధి
  • హైదరాబాద్‌ డిఫెన్స్‌ హబ్‌లో ‘టాటా’ చేరడం సంతోషం
  • పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు
  • నోవా ఇంటిగ్రేటెడ్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌ సంస్థకు భూమిపూజ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రక్షణరంగానికి సంబంధించిన కంపెనీల స్థాపనతో తెలంగాణలోని యువతకు భారీ ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు. దేశ డిఫెన్స్‌ హబ్‌గా ఉన్న హైదరాబాద్‌లో టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టం లిమిటెడ్‌ (టీఏఎస్‌ఎల్‌)కు చెందిన నోవా ఇంటిగ్రేటెడ్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌ (ఎన్‌ఐఎస్‌ఎల్‌) సంస్థ చేరడం సంతోషంగా ఉన్నదని తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన నోవా ఇంటిగ్రేటెడ్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌ కంపెనీ భూమిపూజలో కేటీఆర్‌ పాల్గొని మాట్లాడారు. 


నగరంలో ఇప్పటికే పన్నెండుకుపైగా డీఆర్డీవో వంటి అతిపెద్ద ల్యాబ్‌లతోపాటు రక్షణరంగానికి చెందిన 25 వరకు పెద్ద ప్రైవేటు కంపెనీలు, వెయ్యికిపైగా ఎమ్మెస్‌ఎంఈలు ఉన్నాయని తెలిపారు. ఆరేండ్లుగా హైదరాబాద్‌లో టాటాగ్రూప్‌ కంపెనీల వృద్ధి అద్భుతంగా ఉన్నదని చెప్పారు. మరోసారి టీఏఎస్‌ఎల్‌కు చెందిన ఏరోస్పేస్‌ కంపెనీని హైదరాబాద్‌లో స్థాపించడం సంతోషంగా ఉన్నదని తెలిపారు. 


ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా 600 మందికి ఉపాధి కలుగుతుందని కేటీఆర్‌ వెల్లడించారు. హైదరాబాద్‌ నగరంపై నమ్మకంతో పెట్టుబడులు పెట్టి తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నందుకు టాటాగ్రూప్‌ ప్రతినిధులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌, టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ నర్సింహారెడ్డి, కంపెనీ ఎండీ, సీఈవో సుకారన్‌సింగ్‌తో కలిసి పాల్గొన్నారు.


logo