బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 13, 2020 , 01:36:32

నిరుపేదకు కేటీఆర్‌ అండ

నిరుపేదకు కేటీఆర్‌ అండ
  • వెన్నెముక శస్త్రచికిత్సకు రూ.లక్ష ఎల్వోసీ మంజూరు

గంభీరావుపేట: వెన్నెముక సమస్యతో బాధపడుతున్న ఓ నిరుపేదకు మంత్రి కే తారకరామారావు అండగా నిలిచారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం దమ్మన్నపేటకు చెందిన ఈరవేని లక్ష్మీనర్సయ్య రెం డేండ్ల క్రితం గల్ఫ్‌ వెళ్లారు. మస్కట్‌లోని బల్ది యా కంపెనీలో పారిశుద్ధ్య పనులు చేస్తుండగా గత నెల పదో తేదీన వెన్నెముకలో తీవ్రమైన నొప్పి వచ్చింది. అక్కడ ప్రాథమిక చికి త్స చేయించిన కంపెనీ.. స్వదేశానికి పంపించింది. కుటుంబసభ్యులు ఆయనను కరీంనగర్‌లోని ప్రైవేట్‌ దవాఖానకు తీసుకెళ్లగా, వెన్నెముకకు శస్త్రచికిత్స చేయాలని సూచించారు. ఇందుకు రూ.లక్ష వరకు ఖర్చవుతుందని చెప్పారు. లక్ష్మీనర్సయ్య తల్లి గౌరవ్వ, భార్య కృష్ణవేణి కూడా కూలిపనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకొంటున్నారు. రెక్కల కష్టం తప్ప మరే ఆస్తులులేని వీరు.. సమస్యను ఉపసర్పంచ్‌ అరుట్ల అంజిరెడ్డికి వివరించారు. దీంతో ఆయన సమస్యను మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. నిరుపేద సమస్యపై పెద్ద మనస్సుతో స్పందించిన మంత్రి కేటీఆర్‌ రూ.లక్ష ఎల్వోసీ మంజూరుచేశారు. గురువారం ఎల్వోసీ పత్రాన్ని హైదరాబాద్‌లోని ఓ దవాఖానలో చికిత్స పొందుతున్న లక్ష్మీనర్సయ్యకు అంజిరెడ్డి అందజేశారు. తమకు అండగా నిలిచిన మంత్రి కేటీఆర్‌కు కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.


logo