మంగళవారం 07 ఏప్రిల్ 2020
Telangana - Mar 13, 2020 , 01:07:19

వర్షార్పణం

వర్షార్పణం
  • పసుపు పంటకు అపార నష్టం
  • తడిసిన కందులు, వరి
  • ఆసిఫాబాద్‌, సిద్దిపేట జిల్లాల్లో పిడుగులు
  • పలుచోట్ల వడగండ్ల వాన

హైదరాబాద్‌, నమస్తేతెలంగాణ/నెట్‌వర్క్‌: తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, దక్షిణ ఇంటీరియర్‌ కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతున్నది. ఫలితంగా గురువారం సాయంత్రం రాష్ట్రంలోని పలు  జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. జగిత్యాల, నిజామాబాద్‌ జిల్లాల్లో పసుపు పంట కు తీరని నష్టం వాటిల్లింది.  ఆయా జిల్లాల్లో కందులు, వరి పంటలు తడిశాయి. 

వాంకిడిలో వడగండ్లు

కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా వాంకిడి మండలంలో గురువారం వడగండ్ల వాన పడింది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన వర్షం 40 నిమిషాలపాటు ఎడతెరిపి లేకుండా కురిసింది. మురికి కాల్వలు నిండటంతో పలు ఇండ్లల్లోకి వరద చేరింది. సిర్పూర్‌(టి) మండల కేంద్రంలో సుమారు గంటపాటు ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. కేశవపట్నంలో తాటి చెట్టుపై పిడుగుపడింది. 


తడిసి ముద్దయిన పసుపు 

జగిత్యాల  జిల్లా మెట్‌పల్లిలో గురువారం సా యంత్రం వడగండ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. కల్లాల వద్ద సిద్ధం చేస్తున్న పసుపు, యార్డులో నిల్వ చేసిన పసుపు తడిసిపోయింది. అసలే ధరలు అంతంతమాత్రంగా ఉండగా, ఎండిన పసుపు తడవడంతో నాణ్యత తగ్గి ధర మరింత పడిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మార్కెట్‌ యార్డులో దాదాపు సుమారు రూ.కోటి విలువ చేసే పసుపు ఉన్నట్టు అధికారులు అంచనావేశారు. నిజామాబాద్‌ జిల్లా ఇందల్వాయి మండలం నల్లవెల్లిలో ఓ మోస్తరు వర్షం కురవగా.. పసుపు తడిసిముద్దయింది. పసుపు కల్లాల్లోకి వర్షపునీరు చేరింది. నల్లవెల్లిలో దాదాపు 25 మంది రైతులకు చెంది న ఆరబెట్టిన పసుపు తడిసిపోయింది. సిరికొండ మండల కేంద్రంతోపాటు రావుట్ల, జగదాంబ తండా, కొండూర్‌, చీమన్‌పల్లి గ్రామాల్లో అకాల వర్షంతో  పొట్ట దశలో ఉన్న వరికి నష్టం వాటిల్లింది. ధర్పల్లి మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లోనూ వర్షం కురిసింది. సిద్దిపేట జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురు గాలుల ధాటికి పలుచోట్ల చెట్లు, కరెంటు స్తంభాలు ఒరిగిపోయాయి. మిరుదొడ్డి మండలం భూంపల్లికి వెళ్లే మార్గంలో భారీ వృక్షం కూలడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. పిడుగుపాటుకు కొండపాకలో ఎద్దు మృత్యువాతపడింది. గజ్వేల్‌ మార్కెట్‌ యార్డు లో ఆరబోసిన కందులు తడిసిపోయాయి. గురువారం రాత్రి కరీంనగర్‌ జిల్లా చొప్పదండి, రామడుగు మండలాలతోపాటు  రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటలో ఓ మోస్తరు వర్షం కురిసింది. 


logo