శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Telangana - Mar 11, 2020 , 02:00:43

రైల్వే ప్రెస్‌ కనుమరుగే!

రైల్వే ప్రెస్‌ కనుమరుగే!
  • ప్రైవేట్‌కు రైల్వేటికెట్ల ప్రింటింగ్‌ యోచన
  • శాపంగా కేంద్ర నిర్ణయాలు.. దేశంలో 5 ప్రెస్‌ల పరిస్థితి అంతే
  • ఉద్యోగుల ఆందోళనతో త్రిసభ్య కమిటీ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కేంద్ర ప్రభుత్వం తీరుతో నిజాం కాలంనాటి రైల్వే ముద్రణాలయానికి కాలం దగ్గరపడింది. రైల్వే వ్యవస్థను ప్రైవేటుపరంచేసేలా తీసుకుంటున్న నిర్ణయాలు ఆ సంస్థకు చెందిన అనేక విభాగాలను మూసివేసేందుకు దారితీస్తున్నాయి. ఇందులోభాగంగా దేశవ్యాప్తంగా 5 ప్రింటింగ్‌ప్రెస్‌లకు కాలం చెల్లుతుండగా, ఇందులో సికింద్రాబాద్‌లోని నిజాం ప్రింటింగ్‌ప్రెస్‌ కూడా ఉండటం బాధాకరం. 2020 మార్చి 31లోగా అన్ని ముద్రణాలయాలను మూసివేసి అందులో పనిచేస్తున్న ఉద్యోగులను ఇతర విభాగాలకు పంపించాలని రైల్వేస్టోర్స్‌ బోర్డు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మనోజ్‌కుమార్‌ గుప్తా కొన్ని నెలలకిందట అన్ని రైల్వేజోన్ల జీఎంలకు లేఖరాశారు. దీనిపై దేశవ్యాప్తంగా రైల్వే ఉద్యోగసంఘాల నుంచి నిరసనలు వెల్లువెత్తడంతో తుది నిర్ణయం కోసం రైల్వేబోర్డు.. త్రిసభ్య కమిటీని ఏర్పాటుచేసింది. నివేదికను ఈ నెల 28 వరకు ఇవ్వాలని సూచించింది. నివేదిక ఇచ్చే సమయం సమీపిస్తుండటంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.


ఏండ్లనాటి ముద్రణాలయం

నిజాం గ్యారెంటెడ్‌ స్టేట్‌ రైల్వే పేరుతో నిజాం.. 1870లో హైదరాబాద్‌ స్టేట్‌లో రైల్వే వ్యవస్థను ప్రారంభించారు. ఇదే సమయంలో టికెట్లు, ఇతర ముద్రణా అవసరాల కోసం 1879లో సికింద్రాబాద్‌లోని లేఖా భవన్‌లో ప్రింటింగ్‌ ప్రెస్‌ ప్రారంభించారు. హైదరాబాద్‌ సంస్థానం భారత ప్రభుత్వంలో కలిశాక 1950లో ఇది ప్రభుత్వపరమైంది. 1974లో ఈ ప్రెస్‌ను రైల్‌ నిలయం పక్కకు మార్చారు. నాటినుంచి ఇప్పటివరకు రైల్వేటికెట్లు, ప్రయాణికుల చార్టులు, దరఖాస్తు ఫారాలు, టైంటేబుల్‌, గార్డులు, ఇంజినీర్లు వినియోగించే పుస్తకాలను ముద్రిస్తున్నది. 1987లో రిజర్వేషన్‌ టికెట్ల ముద్రణ కూడా ప్రారంభించింది. రైల్వే నిర్వహణలో ఉపయోగపడే మొత్తం 600 రకాల పత్రాలను ముద్రిస్తున్నది. దక్షిణమధ్య రైల్వేజోన్‌తోపాటు సౌత్‌ ఈస్ట్‌ రైల్వే, ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వేకు ముద్రణ అవసరాలను ఈ ప్రింటింగ్‌ ప్రెస్‌ తీర్చుతున్నది. ఒక్కరోజు 30 లక్షల టికెట్ల ముద్రణ ఇక్కడ జరుగుతుండగా, అన్ని కలుపుకొని ఏడాదికి 80 కోట్ల కంటే ఎక్కువ టికెట్లు ముద్రిస్తున్నది. సికింద్రాబాద్‌లోని ప్రింటింగ్‌ ప్రెస్‌ ఆరు ఎకరాల్లో విస్తరించి ఉన్నది. ఇందులో దాదాపు 200 మంది ఉద్యోగులు, సిబ్బంది పనిచేస్తున్నారు. వీరిలో 20 మంది దివ్యాంగులు, 40 మంది వితంతువులు ఉన్నారు. వీరంతా ప్రింటింగ్‌ప్రెస్‌లో పనిచేసేందుకు ప్రత్యేక శిక్షణ పొందినవారే. చారిత్రక వ్యవస్థ ఉనికిలేకుండా చేయాలని చూడటం సరికాదని, అవాస్తవాలను కారణంగా చూపుతూ మూసేయాలని చూస్తే ఊరుకోబోమని సికింద్రాబాద్‌లోని ప్రింటింగ్‌ప్రెస్‌ ఉద్యోగులు, సిబ్బంది కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. 


మాటమార్చిన బీజేపీ ప్రభుత్వం

దేశంలో మొత్తం 15 ప్రింటింగ్‌ ప్రెస్‌లు ఉండగా, ప్రస్తుతం ఐదు (సికింద్రాబాద్‌తోపాటు ముంబై, హౌరా, ఢిల్లీ, చన్నైలో) మాత్రమే మిగిలాయి. ఆధునికీకరణలో భాగంగా 2014లో రూ.100 కోట్లతో స్పెయిన్‌ నుంచి రొటా టెక్‌ అనే మిషనరీని కేంద్రం సమకూర్చింది. బీజేపీ ప్రభుత్వంలోని రైల్వేమంత్రి ఈ ఆధునిక ప్రింటింగ్‌ యంత్రాలను స్వయంగా ప్రారంభించారు. ఇప్పుడు అదే బీజేపీ సర్కారు దశలవారీగా ప్రింటింగ్‌ ప్రెస్‌ల ఎత్తివేతకు నిర్ణయం తీసుకొన్నది. దశలవారీగా రైల్వేను ప్రైవేటుపరం చేస్తున్న బీజేపీ సర్కారు.. టికెట్ల ముద్రణ కూడా ప్రైవేటుకు ఇవ్వాలని చూస్తున్నదని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీనికి వాస్తవ దూరమైన కారణాలు చెప్తున్నట్టు రైల్వే గణాంకాలే స్పష్టంచేస్తున్నాయి. దక్షిణమధ్య రైల్వేలో 98 శాతం అన్‌రిజర్వుడ్‌ టికెట్లు ప్రింటింగ్‌ రూపంలో ఇస్తుండగా, కేవలం రెండుశాతమే డిజిటలైజేషన్‌ ప్రక్రియ పూర్తయింది. ఇక దేశవ్యాప్తంగా రోజూ పదిలక్షల ప్రింటింగ్‌ టికెట్లు, ఏడాదికి 300 కోట్ల టికెట్లను ముద్రించి ఇస్తున్నారు. డిజిటలైజేషన్‌ జరిగిందని, కాబట్టి ప్రింటింగ్‌ ప్రెస్‌ల అసవరంలేదని రైల్వేబోర్డు చెప్తుండటం విడ్డూరంగా ఉన్నదని ఉద్యోగ సంఘాల నేత లు ఆరోపిస్తున్నారు. టికెట్ల వ్యవస్థను ప్రైవేటుపరం చేసి.. విలువైన రైల్వే భూములను అమ్ముకొనేందుకు కేంద్రం ఇలాంటి చర్యలకు దిగుతున్నదని మండిపడుతున్నారు. 

మూసివేత సరికాదు

ఎంతో చరిత్ర కలిగిన ప్రింటింగ్‌ప్రెస్‌ను మూసేయాలనుకోవటం దారుణం. నిజాం కాలంనాటి ప్రింటింగ్‌ ప్రెస్‌ను మూసేసి స్థలాన్ని సేకరించే ప్రయత్నం జరుగుతున్నది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ ప్రెస్‌ 600 రకాల స్టేషనరీని ప్రచురించి రైల్వేకు సమకూర్చుతున్నది. టికెట్ల వ్యవస్థను ప్రైవేటుపరం చేయాలనే అలోచన మంచిది కాదు. 

- డీ పద్మనాభం, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌,  ఆల్‌ ఇండియా ఓబీసీ రైల్వే ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌logo