శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Telangana - Mar 10, 2020 , 16:19:56

రాజీవ్‌ స్వగృహ ఆస్తుల అమ్మకానికి కార్యదర్శుల కమిటీ

రాజీవ్‌ స్వగృహ ఆస్తుల అమ్మకానికి కార్యదర్శుల కమిటీ

హైదరాబాద్‌ : రాజీవ్‌ స్వగృహ ఆస్తుల అమ్మకానికి ప్రభుత్వం కార్యదర్శుల కమిటీని ఏర్పాటు చేసింది. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు కమిటీని ఏర్పాటు చేశారు. గృహ నిర్మాణశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌ అధ్యక్షతన ఆర్థిక, పురపాలకశాఖల ముఖ్యకార్యదర్శులు సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేశారు. బండ్లగూడ, పోచారంలోని ప్లాట్లు, ఆస్తుల అమ్మకంపై కార్యదర్శుల కమిటీ విధివిధానాలు ఖరారు చేయనుంది.

సమైక్య పాలకులు ఏడేండ్ల క్రితం వదిలేసి వెళ్లిన రాజీవ్‌ స్వగృహ ఇండ్లను తెలంగాణ ప్రభుత్వం కొలిక్కి తెస్తున్నది. రాజీవ్‌ స్వగృహ కింద 36 ప్రాజెక్టులు చేపట్టిన నాటి పాలకులు తెలంగాణలోని భూములను తనఖాపెట్టి బ్యాంకుల నుంచి రూ.1,000 కోట్ల అప్పు తీసుకొన్నారు. అందులో ఒక్క రూపాయి కూడా తిరిగి చెల్లించకుండా తెలంగాణ ప్రభుత్వంపై భారం మోపారు. మూడేండ్ల క్రితం తెలంగాణ ప్రభుత్వం ఈ అప్పుతోపాటు రూ.1,200 కోట్ల వడ్డీని బ్యాంకులకు చెల్లించి తనఖాలో ఉన్న 784 ఎకరాల భూములను విడిపించింది. ఇప్పుడు ఆ భూములను లబ్ధిదారులకు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఇటీవల జరిగిన క్యాబినెట్‌ భేటీలో సీఎం కేసీఆర్‌ దీనిపై నిర్ణయం తీసుకున్నారు. అప్పట్లో ఫ్లాట్లు బుక్‌చేసుకొన్న లబ్ధిదారులకు తొలి ప్రాధాన్యమిచ్చి మిగిలిన ఫ్లాట్లను మార్కెట్‌ ధర ప్రకారం అమ్మాలని భావిస్తుండటంతో మధ్యతరగతి వర్గాల సొంతింటి కల త్వరలో సాకారం కానున్నది.


logo