e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home Top Slides పత్తికి 200

పత్తికి 200

పత్తికి 200
  • వరికి రూ.72.. నువ్వులకు రూ.452 మద్దతు పెంపు
  • కందికి రూ.300, వేరుశనగకు రూ.275
  • అత్యంత తక్కువగా మక్కలకు రూ.20 మాత్రమే
  • వానకాల పంటలకు మద్దతు ధరలు ప్రకటించిన కేంద్రం
  • తెలంగాణ ప్రోత్సహిస్తున్న పంటలకే ఎక్కువ పెంపు
  • రాష్ట్ర మోడల్‌ ఉత్తమం అని మరోసారి రుజువు

హైదరాబాద్‌, జూన్‌ 9 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది వానకాల సీజన్‌కు సంబంధించి పంటలకు కనీస మద్దతు ధరలను కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ మద్దతు ధరలకు ఆమోదం తెలిపింది. మొత్తం 14 పంటలకు మద్దతు ధరను ఖరారు చేసింది. అత్యధికంగా నువ్వులకు రూ.452 ధర పెంచడం గమనార్హం. ఆ తర్వాత కందులు, మినుములకు రూ.300 చొప్పున, వేరుశనగకు రూ. 275 ధర పెంచింది. ఇక ఎక్కువ మంది రైతులు సాగు చేసే పత్తికి రూ.200, వరికి రూ.72 పెంచింది. పత్తి మధ్యరకానికి రూ.211, పొడవు గింజకు రూ.200 పెరిగింది. అత్యంత తక్కువగా మొక్కజొన్నకు కేవలం రూ.20 మాత్రమే పెంచడం గమనార్హం. ఇక ప్రస్తుతం ప్రకటించిన మద్దతు ధరల వల్ల రైతులు పంట పండించేందుకు పెట్టిన పెట్టుబడిపై క్వింటాలుకు కనీసంగా 50-65 శాతం లాభాలు పొందుతారని కేంద్రం పేర్కొంది.

ఇవీ కొత్త ధరలు….
నూతన ధరల ప్రకారం వరి సాధారణ రకం క్వింటాలుకు గతంలో రూ.1868 ఉండగా ఇప్పుడు అది రూ.1940కి పెరిగింది. వరి గ్రేడ్‌-ఏ రకానికి గతంలో రూ.1888 ఉండగా ఇప్పుడు రూ.1960కి పెరిగింది. పత్తి మధ్యరకం గింజ ధర రూ.5515 నుంచి రూ.5726కి పెరుగగా పొడవు గింజ రకం రూ. 5825 నుంచి రూ.6025కి పెరిగింది. ఇక వేరుశనగ గతంలో రూ.5275 నుంచి రూ.5550కు, సోయాబీన్‌ ధర రూ.3880 నుంచి రూ.3950కి, నువ్వులు రూ. 6855 నుంచి రూ.7307కు, కందులు, మినుముల ధర రూ.6వేల నుంచి రూ.6300కు, జొన్నలో హైబ్రిడ్‌ రకం రూ.2640 నుంచి రూ.2738కి పెరిగింది.

వరికి, మక్కకు ధర పెంపు అంతంతే…
వివిధ పంటలకు మద్దతు ధర ప్రకటించిన కేంద్రం.. ఇందులో ఎక్కువ మంది రైతులు సాగు చేసే వరి, మక్కకు అంతంత మాత్రంగానే ధరను పెంచింది. గతంతో పోల్చితే వరికి రూ.20 పెంచినప్పటికీ ఇతర పంటల పెంపుతో పోల్చితే ప్రస్తుత పెంపు తక్కువనే చెప్పుకోవాలి. గతేడాది వరికి రూ.53 పెంచగా ఈసారి మాత్రం రూ.72 పెంచింది. ఇక ఈసారి మక్కకు మరింత తక్కువగా ధర పెంచడం గమనార్హం. గతేడాది రూ.90 పెంచిన కేంద్రం ఈసారి మాత్రం రూ.20కే పరిమితం చేసింది. దేశ వ్యాప్తంగా ధాన్యం, మక్కల నిల్వలు ఎక్కువ కావడంతో ప్రభుత్వం ఈ పంటలకు మద్దతు ధరను ఎక్కువగా పెంచలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరీ ముఖ్యంగా మక్కలకు ఏ మాత్రం డిమాండ్‌ లేదు. దేశ విదేశాల్లో అవసరానికి మించి నిల్వలు ఉండడంతో ఎవరూ కొనుగోలు చేసే పరిస్థితి లేదు.

తెలంగాణ మోడల్‌.. ఆచరణీయం
పంటల సాగు విధానంలో, ప్రణాళికలో తెలంగాణ అనుసరిస్తున్న విధానం ఆచరణీయమని మరోసారి రుజువైంది. దేశ విదేశాల్లో పంటలకు గల డిమాండ్‌ను బట్టి ఏ పంటలను సాగు చేయాలి.. ఏ పంటలను సాగు చేయొద్దని ఇప్పటికే రైతులకు ప్రభుత్వం సూచించింది. మరీ ముఖ్యంగా సీఎం కేసీఆర్‌ మరింత ముందుచూపుతో వ్యవహరించి ఈ సీజన్‌లో ఎక్కువ భాగం పత్తి, కంది, వేరుశనగతో పాటు ఇతర పప్పు దినుసుల పంటను సాగు చేయాలని రైతులకు సూచించారు. సీఎం సూచించిన విధంగా పత్తికి, కందులకు, వేరుశనగలకు కేంద్రం అత్యధిక ధరను పెంచడం గమనార్హం. ఈ పంటలను పండించడం వల్లే రైతుకు లాభాలు వస్తాయని సీఎం కేసీఆర్‌ చెప్పిన మాటలనే.. ఇప్పుడు కేంద్రం అనుసరించడం విశేషం.

రైల్వే సిగ్నలింగ్‌ వ్యవస్థ బలోపేతం
రైల్వేలో కమ్యూనికేషన్‌, సిగ్నలింగ్‌ వ్యవస్థను బలోపేతం చేయాలని క్యాబినెట్‌ నిర్ణయించింది. ఇందుకు 700 ఎంహెచ్‌జెడ్‌ బ్యాండ్‌లో 5ఎంహెచ్‌జెడ్‌ స్పెక్ట్రమ్‌ను కేటాయించింది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పత్తికి 200

ట్రెండింగ్‌

Advertisement