శనివారం 11 జూలై 2020
Telangana - Jun 05, 2020 , 02:17:26

కరోనా మృతులకు హైదరాబాద్‌లో 20 ఎకరాల శ్మశానవాటిక

కరోనా మృతులకు హైదరాబాద్‌లో 20 ఎకరాల శ్మశానవాటిక

హైదరాబాద్‌  : మనిషి మరణించిన తరువాత ఎంతో హృద్యంగా, సకల మర్యాదలతో నిర్వహించాల్సిన అంతిమ సంస్కారాన్ని కరోనా మహమ్మారి అడ్డుకొంటున్నది. మనిషి చిట్టచివరి ప్రయాణానికి ఎవరూ తోడు రాకుండా మృత్యుభయం అడ్డుకొంటున్నది. వైరస్‌ బారిన పడి చనిపోతే.. అంత్యక్రియలు నిర్వహించడానికి కుటుంబ సభ్యులు కూడా దగ్గరకు రాని దయనీయ స్థితి నెలకొన్నది. కొవిడ్‌-19 పంజాకు బలైపోయిన వారు అనాథ శవాల్లా కాటికాపరుల కాగడాలకు కాలిపోకుండా, తగిన మర్యాదలతో వారి వారి సంప్రదాయాల ప్రకారం ఉత్తర క్రియలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. మృతుల కోసం ప్రత్యేక శ్మశానవాటికను ఏర్పాటుచేస్తున్నది. రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలో 20ఎకరాల స్థలాన్ని కేటాయించాలని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. స్థలాన్ని తమకు బదలాయించాలని రెండు జిల్లాల కలెక్టర్లకు జీహెచ్‌ఎంసీ అధికారులు లేఖలు రాశారు. స్థానికులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా శ్మశానవాటికను అభివృద్ధి చేస్తామని భరోసా ఇస్తున్నారు. స్థానికులనుంచి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు స్థలాల వివరాలు గోప్యంగా ఉంచుతున్నారు. హైదరాబాద్‌లో శిథిలావస్థలో ఉన్న పలు విద్యుత్‌ దహనవాటికలకు మరమ్మతులు చేసేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు ఏర్పాట్లుచేస్తున్నారు. ఇవి అందుబాటులోకి వస్తే కేవలం పది నిమిషాల్లోనే దహనక్రియ పూర్తవుతుందని చెప్తున్నారు. logo