శనివారం 23 జనవరి 2021
Telangana - Dec 31, 2020 , 11:19:43

ఓ కుటుంబానికి విషాదాన్ని మిగిల్చిన క‌రోనా

ఓ కుటుంబానికి విషాదాన్ని మిగిల్చిన క‌రోనా

హైద‌రాబాద్ : క‌రోనా మ‌హ‌మ్మారి.. ఓ కుటుంబానికి విషాదాన్ని మిగిల్చింది. బిడ్డ‌కు క‌రోనా సోక‌డంతో తండ్రి గుండెపోటుతో మృతి.. భ‌ర్త మ‌ర‌ణంతో భార్య దిగులుతో మంచం ప‌ట్టింది. ఓ వైపు తండ్రిని కోల్పోవ‌డం, మ‌రో వైపు త‌ల్లి ప‌క్ష‌వాతానికి గురికావ‌డం.. చిన్న కుమారుడిని మాన‌సికంగా కుంగ‌దీశాయి. ఈ క్ర‌మంలో అత‌ని మాన‌సిక స్థితి దెబ్బ‌తిన్న‌ది. చివ‌ర‌కు అత‌ను కూడా ఆత్మ‌హ‌త్య చేసుకుని భార్య‌కు తీవ్ర‌ విషాదాన్ని మిగిల్చాడు. 

హైద‌రాబాద్ బండ్ల‌గూడ‌కు చెందిన బాల న‌ర్స‌య్య‌(71) ఇరిగేష‌న్ డిపార్ట్‌మెంట్ రిటైర్డ్ ఉద్యోగి. ఆయ‌న‌కు భార్య, ఇద్ద‌రు కుమార్తెలు, ఇద్ద‌రు కుమారులు ఉన్నారు. బాల‌న‌ర్స‌య్య కుటుంబ‌మంతా క‌లిసే ఉంటోంది. అయితే ఆరు నెల‌ల క్రితం బాల‌న‌ర్స‌య్య పెద్ద కుమార్తె అనారోగ్యానికి గురికావ‌డంతో ఆస్ప‌త్రికి తీసుకెళ్లాడు. ఆమెకు క‌రోనా పాజిటివ్ అని తేల‌డంతో.. ఆస్ప‌త్రిలోనే న‌ర్స‌య్య‌కు గుండెపోటు వ‌చ్చింది. ఆ త‌ర్వాత మూడు రోజుల‌కే ఆయ‌న మృతి చెందాడు. 

న‌ర్స‌య్య మ‌ర‌ణంతో ఆయ‌న భార్య తీవ్ర మ‌నోవేద‌న‌కు గురైంది. ఆమెకు ప‌క్ష‌వాతం వ‌చ్చింది. చిన్న కుమారుడు సీతారామ సాయి ప్ర‌సాద్ వ‌ర్మ‌(31) తండ్రి మ‌ర‌ణాన్ని త‌ట్టుకోలేక మాన‌సికంగా కుంగిపోయాడు. అత‌నికి మ‌తిస్థిమితం కోల్పోవ‌డంతో ఆస్ప‌త్రుల చుట్టూ తిరిగి బాగు చేసుకున్నారు కుటుంబ స‌భ్యులు. ఇటీవ‌లే ప్ర‌సాద్ వ‌ర్మ కోలుకుని మ‌ళ్లీ త‌న ఉద్యోగంలో చేరాడు. చివ‌ర‌కు నిన్న ఆత్మ‌హ‌త్యకు పాల్ప‌డ్డాడు ప్ర‌సాద్ వ‌ర్మ‌.

ఏడాది క్రిత‌మే వివాహం.. భార్య గ‌ర్భిణి

ప్ర‌సాద్ వ‌ర్మ‌కు ఏడాది క్రితం రామంతాపూర్‌కు చెందిన సిరితో వివాహ‌మైంది. ప్ర‌స్తుతం ఆమె నిండు గ‌ర్భిణి. దీంతో కాన్పు కోసం రెండు వారాల క్రితం పుట్టింటికి వెళ్లింది. ఆమె పురుడు పోసుకోక ముందే ప్ర‌సాద్ వ‌ర్మ ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డంతో.. సిరి శోక‌సంద్రంలో మునిగిపోయింది. 

రోదిస్తుండ‌గానే పురిటి నొప్పులు

భ‌ర్త మృత‌దేహం వ‌ద్ద రోదిస్తున్న స‌మ‌యంలోనే ఆమెకు పురిటినొప్పులు వ‌చ్చాయి. దీంతో ఆమెను ఉప్ప‌ల్‌లోని ప్ర‌సూతి ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అనారోగ్యం కార‌ణంగా ఉద్యోగం మానేయ‌డం, జీతం లేక‌పోవ‌డంతో బ్యాంకుల్లో చేసిన వ్య‌క్తిగ‌త రుణాల భారం పెర‌గ‌డం కూడా అత‌ని ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణ‌మై ఉండొచ్చ‌ని పోలీసులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. 


logo