గురువారం 28 మే 2020
Telangana - May 10, 2020 , 01:17:09

బాల్‌ కోసం వెళ్లి.. బావిలో మునిగి

బాల్‌ కోసం వెళ్లి.. బావిలో మునిగి

మంచిర్యాల జిల్లాలో ఇద్దరు చిన్నారుల మృతి

దండేపల్లి/ముస్తాబాద్‌: బావిలో పడిన ఫుట్‌బాల్‌ తీసేందుకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కన్నెపల్లిలో శనివారం చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన దుమ్మని హర్షిత్‌వర్మ(7), జన్నారం మండలం బాదంపెల్లికి చెందిన మోటపల్కుల విఘ్నేశ్‌(8), మోటపల్కుల సత్యనారాయణ, మోటపల్కుల అజేందర్‌ శనివారం మధ్యాహ్నం ఫుట్‌బాల్‌ ఆడుకుంటూ వ్యవసాయ బావి వైపు వెళ్లారు. ఈ క్రమంలో బాల్‌ బావిలో పడటంతో బయటకు తీసే ప్రయత్నంలో హర్షిత్‌వర్మ, విఘ్నేశ్‌ నీట మునిగారు. మిగతా ఇద్దరు హర్షిత్‌వర్మ తండ్రి శ్రీనివాస్‌కు సమాచారం ఇవ్వగా అతను బావి వద్దకు చేరుకొని చిన్నారులను బయటకు తీయగా అప్పటికే ప్రాణాలు వదిలారు. ఈ ఇద్దరు చిన్నారులు అక్కాచెల్లెళ్ల పిల్లలు కావడంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొన్నది. 

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈతకు వెళ్లి ఒకరు..


రాజన్న సిరిసిల్ల జిల్లా బందనకల్‌ గ్రామానికి చెందిన కొమ్మెట శ్రీనివాస్‌, ప్రమీల దంపతుల చిన్న కొడుకు పవన్‌(11) గ్రామంలోని పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. ఈత నేర్చుకునేందుకు దగ్గరి బంధువు, మరో బాలుడితో కలిసి పవన్‌ సమీపంలోని వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు కాలు జారి బావిలో పడ్డాడు. మరో బాలుడు గ్రామంలోకి వచ్చి విషయం తెలుపగా గ్రామస్థులు, కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా పవన్‌ అప్పటికే మృతి చెందాడు.  


logo