శనివారం 11 జూలై 2020
Telangana - Jun 23, 2020 , 01:54:16

హరిత హైదరాబాదే లక్ష్యం

హరిత హైదరాబాదే లక్ష్యం

  • 25 నుంచి ఆరోవిడుత హరితహారం
  • జీహెచ్‌ఎంసీలో 2.50 కోట్ల మొక్కలు 
  • సమీక్షలో మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: హరితహారంలో భాగంగా హైదరాబాద్‌ను హరితమయంగా మార్చాలని సంకల్పించినట్టు ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు. ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ఆరో విడుత హరితహారంలో జీహెచ్‌ఎంసీ పరిధిలో 2.50 కోట్ల మొక్కలు నాటాలని తెలిపారు. 700 ట్రీ పార్కులతోపాటు 75 చోట్ల యాదాద్రి మోడల్‌ ప్లాంటేషన్‌ చేపట్టాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. సోమవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో హరితహారం అమలుపై కార్పొరేటర్లు, జోనల్‌ డిప్యూటీ కమిషనర్లతో మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మల్లారెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. ప్రతి డివిజన్‌ పరిధిలోని కాలనీలు, ప్రభుత్వ ఖాళీ స్థలాలు, పార్కులు, లే అవుట్‌ ఖాళీ స్థలాలు, చెరువులు, కుంటలు, నాలాలకు ఇరువైపులా మొక్కలు నాటేందుకు ఈ నెల 30లోపు గ్రీన్‌ యాక్షన్‌ప్లాన్‌ను రూపొందించాలని కార్పొరేటర్లకు సూచించారు. సమావేశంలో మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.


logo