బుధవారం 15 జూలై 2020
Telangana - Jun 14, 2020 , 02:32:52

సాధారణ స్థితికి రిజిస్ట్రేషన్లు

సాధారణ స్థితికి రిజిస్ట్రేషన్లు

రోజు సగటున 5,625 రిజిస్ట్రేషన్లు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సాధారణ స్థితికి చేరుకున్నది. కరోనా, లాక్‌డౌన్‌కు ముందు రోజుకు సగటున ఐదు వేల నుంచి ఆరువేల రిజిస్ట్రేషన్లు అయ్యేవి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఏప్రిల్‌ మొత్తం 4,595 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌ కాగా.. రూ.12.74 కోట్ల ఆదాయం వచ్చింది. మే నెలలో 75,129 రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.207.73 కోట్లు సమకూరాయి. ఇక ఈ నెల ఇప్పటికే  61,882 రిజిస్ట్రేషన్లతో రూ.171.14 కోట్ల ఆదాయం వచ్చింది. ఇందులో రెండు సెలవు దినాలు మినహాయిస్తే ప్రతిరోజు సగటున 5,625 రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.15.55 కోట్ల ఆదాయం వస్తున్నది. ఈ నెలాఖరు వరకు రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ.350 కోట్ల మార్కును చేరుకోవచ్చని ఆ శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

రవాణాశాఖకు రూ.162 కోట్ల ఆదాయం

రాష్ట్ర రవాణాశాఖ కార్యకలాపాలు మెల్లమెల్లగా పుంజుకుంటున్నాయి. గత 34 రోజుల్లో 43 వేల వాహన రిజిస్ట్రేషన్లు జరిగాయి. రవాణాశాఖకు రూ.162 కోట్ల ఆదాయం సమకూరింది. సాధారణ రోజుల్లో నెలకు రూ.300 కోట్ల ఆదాయం వస్తుండగా, కరోనా దెబ్బతో 57 శాతం పడిపోయింది. 2020-21 లో రవాణాశాఖకు రూ.3,400 కోట్ల ఆదాయం వస్తుందని మార్చిలో అధికారులు అంచనా వేశారు. అదేనెల మూడోవారం నుంచే లాక్‌డౌన్‌ విధించడంతో పరిస్థితి తలకిందులైంది. సాధారణ పరిస్థితుల్లో రవాణాశాఖకు రోజుకు రూ.9 కోట్ల నుంచి 10 కోట్ల వరకు వసూలవుతాయి. రాష్ట్రవ్యాప్తంగా నెలకు సగటున లక్ష వాహనాలు రిజిస్ట్రేషన్‌ అవుతాయి. కానీ, మే 7 నుంచి ఈనెల 10వ తేదీ వరకు వీటిసంఖ్య 57 శాతం పడిపోయిందని రవాణాశాఖవర్గాలు తెలిపాయి. తమ శాఖ ఆదాయంలో సింహభాగంగా ఉన్న లైఫ్‌ట్యాక్స్‌ వసూళ్లు పడిపోయాయని, ఈ ఆర్థిక సంవత్సరంలో 30 శాతం ఆదాయం తగ్గే అవకాశం ఉన్నదని అంచనావేస్తున్నాయి.


logo