గురువారం 28 మే 2020
Telangana - May 07, 2020 , 02:20:01

పత్తి విత్తనంతో 1616 కోట్లు

పత్తి విత్తనంతో 1616 కోట్లు

  • బీటీ పత్తివిత్తన కేంద్రంగా తెలంగాణ
  • 2.21 కోట్ల ప్యాకెట్ల విత్తనాలు ఉత్పత్తి
  • దేశ అవసరాల్లో రాష్ట్రంనుంచే 65 శాతం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: దేశ విత్తనభాండాగారంగా పేరొందిన తెలంగాణ బీటీ పత్తి విత్తనోత్పత్తిలోనూ రికార్డు సృష్టిస్తున్నది. దేశానికి అవసరమైన పత్తి విత్తనాల్లో దాదాపు 65 శాతం రాష్ట్రం నుంచే ఉత్పత్తి చేస్తున్నది. దేశంలో 5.80 కోట్ల ప్యాకెట్ల బీటీ పత్తి విత్తనాలు ఉత్పత్తి కాగా, ఒక్క తెలంగాణలోనే 2 కోట్ల 21 లక్షల 42 వేల ప్యాకెట్ల విత్తనాలు ఉత్పత్తయ్యాయి. వీటిద్వారా రాష్ట్ర రైతులకు రూ.1616 కోట్ల ఆదాయం వస్తున్నది. వ్యవసాయం కోసం రాష్ట్రప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. అత్యంత అనువైన వాతావరణం కలిగి, నాణ్యమైన విత్తనాల ఉత్పత్తికి కేంద్రంగా నిలుస్తున్న తెలంగాణ రాష్ట్రం దేశానికి కావాల్సిన విత్తన అవసరాల్లో 65 శాతం తీరుస్తున్నది. 

ఈ ఏడాది ఆధునిక సాంకేతిక ‘ బీటీ’ టెక్నాలజీని ఉపయోగించి రికార్డుస్థాయిలో హైబ్రీడ్‌ పత్తి విత్తనాలు ఉత్పత్తిచేసి దేశానికి అందిస్తున్నది. ఎకరం పత్తి సాగుకు 450 గ్రాముల విత్తన ప్యాకెట్లు (900 గ్రాములు) రెండు అవసరమవుతాయి. కేంద్రప్రభుత్వం ఇటీవల ఒక్కో ప్యాకెట్‌ ధరను రూ.730గా ఖరారు చేసింది. దీనిప్రకారం రాష్ట్రంలో ఉత్పత్తయిన బీటీ పత్తి విత్తనాలకు రూ.1616.63 కోట్ల ఆదాయం రానున్నది. తెలంగాణలో ఈ ఏడాది 55.87 లక్షల ఎకరాల్లో బీటీ పత్తి సాగు అవుతుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. 

ఇందుకోసం కోటి 9 లక్షల ప్యాకెట్లు అవసరమవుతాయి. మిగిలిన కోటి 12 లక్షల ప్యాకెట్లు తమిళనాడు, ఏపీ, పంజాబ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. రాష్ట్రంలో జోగుళాంబ గద్వాల, వరంగల్‌ రూరల్‌, కరీంనగర్‌, నల్లగొండ, వనపర్తి జిల్లాల్లో బీటీ పత్తి హైబ్రీడ్‌ విత్తనోత్పత్తి జరుగుతున్నది. సుమారు 70 విత్తన సంస్థలు పత్తివిత్తనోత్పత్తిలో నిమగ్నమయ్యాయి. మహారాష్ట్రలోని జాల్నా, తమిళనాడులోని అథూర్‌, ఏపీలోని నంద్యాల, ఏలూరు, కర్ణాటకలోని గజేంద్రగఢ్‌, గుజరాత్‌లోని బోడెవ్లీఎస్కే ప్రాంతాల్లోనూ పత్తి విత్తనోత్పత్తి జరుగుతున్నప్పటికీ.. ఉత్పత్తి సైజు, ప్యాకెట్ల సంఖ్యపరంగా తెలంగాణ దేశంలోనే మొదటిస్థానంలో ఉన్నది. మహారాష్ట్ర రెండు, గుజరాత్‌ మూడు స్థానాల్లో ఉన్నాయి.


logo