సోమవారం 18 జనవరి 2021
Telangana - Jan 02, 2021 , 01:13:29

పంచాయతీల ఖాతాల్లో 1,593 కోట్లు

పంచాయతీల ఖాతాల్లో 1,593 కోట్లు

  • అభివృద్ధి పనులకు అందుబాటులో నిధులు
  • పంచాయతీలకు ప్రతినెలా 339 కోట్లు విడుదల
  • కేంద్ర నిధులు ఆలస్యమైనా వెనక్కుతగ్గని రాష్ట్ర సర్కార్‌

తెలంగాణ పల్లెలను దేశంలోనే ఉత్తమంగా నిలపాలన్నది రాష్ట్రప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం అన్ని గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతను పెంపొందించడంతోపాటు, వందశాతం మరుగుదొడ్లు, శ్మశానవాటికల నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు శ్రీకారం చుట్టింది. ఈ పనుల కోసం ప్రతినెలా రూ.339 కోట్లు విడుదల చేస్తున్నది. ఇలా విడుదల చేసిన నిధులు పంచాయతీల ఖాతాల్లో ఇప్పటికే రూ.1,593 కోట్లు అందుబాటులో ఉన్నాయి.

హైదరాబాద్‌, జనవరి 1 (నమస్తే తెలంగాణ): కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆదాయం గణనీయంగా తగ్గినా గ్రామ పంచాయతీలకు రాష్ట్రప్రభుత్వం ఎలాంటి జాప్యం లేకుండా నిధులను విడుదల చేస్తున్నది. దేశానికి ఆదర్శంగా తెలంగాణ పల్లెలను తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీల్లో పలు పనులను చేపట్టింది. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా పచ్చదనం, పరిశుభ్రత చర్యలు చేపట్టింది. బహిరంగ మలవిసర్జన రహిత రాష్ట్రమే లక్షంగా పంచాయతీల్లో వందశాతం మరుగుదొడ్ల నిర్మాణానికి పూనుకున్నది. వీటితోపాటు, గ్రామాల్లో వైకుంఠధామాలు, సీసీ రోడ్లు, డంపింగ్‌ యార్డులు, తడి పొడి చెత్తను వేరుచేసే షెడ్లు లాంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12,769 గ్రామ పంచాయతీలకు ప్రతినెలా రూ.339 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించి.. క్రమం తప్పకుండా ఆ నిధులను పంచాయతీల ఖాతాల్లో జమ చేస్తున్నది. ఇలా ప్రతినెలా విడుదల చేసిన నిధులలో డిసెంబర్‌ నెలాఖరు నాటికి గ్రామపంచాయతీల ఖాతాల్లో రూ.1,593.25 కోట్లు అందుబాటులో ఉన్నాయి. 

కేంద్రం నుంచి ఆలస్యమైనా..

వివిధ అభివృద్ధి పథకాలకు కేటాయించిన నిధుల విడుదలలో కేంద్రం జాప్యం చేస్తున్నప్పటికీ ప్రతినెలా పంచాయతీలకు నిధులు విడుదల చేయడంలో మాత్రం రాష్ట్రప్రభుత్వం వెనక్కు తగ్గడం లేదు. ఉపాధి హామీలో చేపట్టే పనుల కోసం కేంద్రం చెల్లించాల్సిన రాష్ట్రవాటా 25 శాతం ఆలస్యమవుతున్నది. గ్రామాల్లో చేపట్టే ఆ పనులకు ఆటంకం కలుగకుండా రాష్ట్రం వాటా నిధులను కూడా అందజేస్తున్నది. పంచాయతీలో ఉన్న నిధులను సర్దుబాటు చేసుకునే అవకాశం కూడా కల్పించింది. డిసెంబర్‌ నెలాఖరు నాటికి ప్రతి గ్రామ పంచాయతీలో సాధారణం కంటే అధికంగానే నిధులు అందు       బాటులో ఉన్నాయి.