బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 08, 2020 , 13:28:51

మైనార్టీల సంక్షేమానికి రూ. 1,518 కోట్లు

మైనార్టీల సంక్షేమానికి రూ. 1,518 కోట్లు

హైదరాబాద్‌ : ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే మైనార్టీలు కూడా వెనుకబడి ఉన్నారని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. ఈ బడ్జెట్‌లో మైనార్టీల అభివృద్ధి, సంక్షేమం కోసం రూ. 1,518.06 కోట్లు ప్రతిపాదించినట్లు ఆయన వెల్లడించారు. మైనార్టీ విద్యార్థులు ఫీజురియింబర్స్‌మెంట్‌ రూపంలో ఇప్పటివరకు రూ. 137 కోట్ల అదనపు ప్రయోజనం పొందారని మంత్రి తెలిపారు. మసీదుల్లో ప్రార్థనలు జరిపే ఇమాం, మౌజమ్‌లకు నెలకు రూ. 5 వేల చొప్పున గౌరవ భృతిని ప్రభుత్వం అందిస్తున్నదని చెప్పారు. రంజాన్‌, క్రిస్మస్‌ పండుగలకు నూతన వస్ర్తాలు పంపిణీ చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. మైనార్టీ యువత స్వయం ఉపాధి కోసం ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. నగరంలోని నాంపల్లిలో అనాథలకు ఆశ్రయం కల్పిస్తున్న అనీస్‌ - ఉల్‌ - గుర్భా నూతన భవన నిర్మాణం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. టీఎస్‌ ప్రైమ్‌ పేరుతో మైనార్టీ పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక ప్రోత్సాహం కల్పిస్తుందన్నారు మంత్రి. మైనార్టీ విద్యార్థుల కోసం 204 గురుకుల విద్యాలయాలను నడుపుతున్నట్లు మంత్రి తెలిపారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి 71 మైనార్టీ జూనియర్‌ కళాశాలలను ప్రభుత్వం ప్రారంభించినున్నట్లు మంత్రి ప్రకటించారు. షాదీముబారక్‌ పథకం ద్వారా ఇప్పటి వరకు 1,44,301 మంది మైనార్టీ వర్గాల యువతులు లబ్ధి పొందారు. 2019-20 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో కేటాయించిన రూ. 1,369 కోట్ల నిధులు మైనార్టీ సంక్షేమం కోసం ఈ నెలాఖరు లోపు సంపూర్ణంగా ఖర్చు పెట్టబడుతాయని మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు.


logo