శనివారం 30 మే 2020
Telangana - Apr 08, 2020 , 01:45:46

వ్యాప్తి నిరోధంతోనే విముక్తి

వ్యాప్తి నిరోధంతోనే విముక్తి

  • మూడు దశల్లో వైరస్‌ను ఎదుర్కొనే వ్యూహం
  • ఆర్థిక అంశాలకంటే.. ప్రజల ప్రాణాలే ముఖ్యం
  • పరిస్థితి చేయిదాటితే.. మనల్ని మనం క్షమించుకోలేం
  • జాతీయ మీడియాతో మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: వైరస్‌ వ్యాప్తిని నిరోధించడంతోనే కరోనా నుంచి విముక్తి లభిస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. మూడు దశల్లో కరోనా వైరస్‌ను ఎదుర్కొనే వ్యూహంతో తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకొంటున్నదని పేర్కొన్నారు. ప్రజల ప్రాణాల కన్నా ఆర్థిక అంశాలు ముఖ్యం కాదని తెలిపారు. ప్రజలు ఆరోగ్యంగాఉంటే ఇప్పటికంటే ఎక్కువ కష్టపడి ప్రగతి సాధించవచ్చన్నారు. జూన్‌ మొదటివారానికి దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంటుందని వెల్లడవుతున్న పలు నివేదికల మేరకు.. దాన్ని ఎదుర్కోవడానికి లాక్‌డౌన్‌ పొడిగింపే సరైందనుకొంటే.. అందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టంచేశారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలపై మంత్రి కేటీఆర్‌ మంగళవారం జాతీయ మీడియాతో మాట్లాడారు. అమెరికా, యూరప్‌ దేశాల్లో  తలెత్తిన పరిస్థితులు మనదేశంలో రాకుండా ఉండాలంటే లాక్‌డౌన్‌, సామాజికదూరం పాటించడం ఒక్కటే మార్గమన్న అభిప్రాయాన్ని ప్రధానికి సీఎం కేసీఆర్‌ తెలిపారన్నారు. 

అభివృద్ధిచెందిన దేశాలు సైతం ఎదుర్కోలేని కరోనా సంక్షోభాన్ని భారత్‌ ఎదుర్కోవడం సాధ్యంకాదన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఉన్నారని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. లాక్‌డౌన్‌ సమయంలో పేదలు, వలస కార్మికుల సంక్షేమంపై దేశంలోని ఇతర రాష్ర్టాలకు తెలంగాణ మార్గదర్శిగా నిలిచిందని చెప్పారు. పేదలకు రేషన్‌ ఇవ్వడం, వలస కార్మికులకు ఆహార సరఫరా, కరోనా కట్టడికోసం పనిచేస్తున్న సిబ్బందికి ప్రోత్సాహకాల్లాంటి అనేక కార్యక్రమాలను ప్రభుత్వం చేస్తున్నదని పేర్కొన్నారు. అమెరికాలోని న్యూయార్క్‌లాంటి ఆర్థికంగా ఆగ్రభాగాన ఉన్న పట్టణాలు, దేశాలకు సైతం కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని మంత్రి కేటీఆర్‌ గుర్తుచేశారు. న్యూయార్క్‌లో అవసరమైన వెంటిలేటర్లు, దవాఖానలు కూడా లేని దుస్థితి నెలకొన్నదని తెలిపారు. ప్రపంచంలోని ఏ ప్రాంతం కరోనాను ఎదుర్కొనే పరిస్థితిలోలేదన్నారు. కేవలం తెలంగాణ, భారతదేశం మాత్రమేకాదని అమెరికాలాంటి అగ్రరాజ్యాలు కూడా కరోనా వైరస్‌ ఎదుర్కోలేకపోతున్నాయని చెప్పారు.   

వ్యాప్తిని అరికట్టడమే ప్రత్యామ్నాయం

లాక్‌డౌన్‌ కొనసాగించడంద్వారా మాత్రమే దేశంలో వైరస్‌ని ఎదుర్కొనవచ్చన్న అభిప్రాయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నారని తెలిపారు.  దేశంలో, రాష్ట్రంలో వైరస్‌ వ్యాప్తి పూర్తిగా ఆగిన తరువాతే ఎత్తివేయాలని కేటీఆర్‌ అన్నారు. కరోనా హాట్‌స్పాట్‌గా పేర్కొంటున్న ప్రాంతాల్లో సంఖ్యాపరంగా టెస్టుల సామర్థ్యాన్ని మరింత పెంచాలని సూచించారు. విచ్చలవిడిగా కరోనా టెస్టులకు అనుమతిస్తే , అసలైన రోగులకు టెస్టులు చేయించుకొనే అవకాశం లభ్యం కాకపోవచ్చని చెప్పారు. ప్రైవేటు డయాగ్నస్టిక్‌ సెంటర్లు ప్రజల భయాందోళనలను అవకాశంగా తీసుకొని సొమ్ముచేసుకొనే అవకాశమున్నదని తెలిపారు. టెస్టులపై అత్యంత ప్రణాళికాబద్ధంగా పనిచేస్తూ ముందుకుపోతున్నామని మంత్రి కేటీఆర్‌ వివరించారు. 130 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఎన్ని టెస్టులు చేస్తే రోగులను గుర్తుపట్టగలమో ఆలోచించాలన్నారు. దానికి బదులుగా వ్యాప్తిని అరికట్టడమే విముక్తికి మార్గమనిచెప్పారు. లాక్‌డౌన్‌ పరిస్థితులను తమ ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నదని వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లో ఒక్క అకలిచావు ఉండకూడదన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. దీంతోపాటు ప్రైవేటు ఉద్యోగాలుచేసున్న వారికి జీతాలివ్వాలని సూచించామన్నారు. కూలీలను ప్రభుత్వం ఆదుకొంటుందని చెప్పారు. అద్దెల వంటి ఖర్చుల విషయంలో ప్రజలను బలవంతపెట్టకుండా మరికొంత సమయం ఇవ్వాలని మార్గదర్శకాలు జారీచేశామని తెలిపారు.  

ప్రాణాలకన్నా ఆర్థిక అంశాలు ముఖ్యంకాదు

లాక్‌డౌన్‌తో ప్రజలకు, సమాజానికి ప్రభుత్వానికి కొన్ని ఇబ్బందులున్నప్పటికీ వైరస్‌వ్యాప్తి నిరోధకమే కీలకమైన అంశమని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. ఏ కారణంతోనైనా ఒకవేళ పరిస్థితి చేయి దాటిపోతే మనల్ని మనం భవిష్యత్‌లో క్షమించుకోలేమన్నారు. ప్రజల ప్రాణాల కన్నా ఆర్థిక అంశాలు ముఖ్యం కాదని తెలిపారు. ప్రజలు ఆరోగ్యంగాఉంటే ఇప్పటికంటే ఎక్కువ కష్టపడి ప్రగతి సాధించవచ్చన్నారు. మూడుదశల్లో కరోనా వైరస్‌ను ఎదుర్కోవడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నదని చెప్పారు. కరోనాను ఎదుర్కొనేందుకు అనేక రకాలుగా తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదని, ఈ మేరకు అనేక నూతన ఐసొలేషన్‌ వార్డులు, 15 వేల బెడ్లు, వైద్య సామగ్రిని సిద్ధం చేస్తున్నదని వివరించారు. అవసరమైతే ప్రైవేటు మెడికల్‌ కాలేజీలను వాడుకొంటామని చెప్పారు. పరిశ్రమలను ఆదుకునేందుకు ఇప్పటికే పరిశ్రమలు, కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నామని మంత్రి కేటీఆర్‌ వివరించారు. 

15 నాటికి కొత్త దవాఖానలు

  • రాష్ట్రంలోని 22 మెడికల్‌ కాలేజీల్లోనూ ఏర్పాట్లు
  • పనులు పరిశీలించిన మంత్రులు కేటీఆర్‌, ఈటల
  • 10 నుంచి ప్రైవేట్‌ దవాఖానల్లో కరోనా రోగులకు చికిత్స

రాష్ట్రం లో కరోనా వ్యాధిగ్రస్థుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వారి చికిత్సకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లుచేస్తున్నది. గచ్చిబౌలిలోని స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ను, మొయినాబాద్‌లోని భాస్కర్‌ మెడికల్‌ కాలేజీని తాత్కాలిక దవాఖానలుగా రూపొందిస్తున్నది. ఈ నెల 15నాటికి వీటిని అందబాటులోకి తేనున్నా రు. ఇప్పటికే ఎనిమిది సర్కారు దవాఖానల్లో ప్రత్యేక వార్డులు, పడకలను అందుబాటులోకి తెచ్చింది. రోగుల సంఖ్య మరింత పెరిగితే రాష్ట్రంలోని 22 ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లో కూడా చికిత్స అందించాలని నిర్ణయించింది. గచ్చిబౌలి స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో జరుగుతున్న పనులను మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌, వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ మంగళవారం పరిశీలించారు. 

కరోనా కట్టడిలో భాగంగా ఈ దవాఖానను రూపొందిస్తున్నట్టు వారు చెప్పారు. వీలైనంత త్వరగా అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. 15 అంతస్థులు ఉన్న ఈ భవనంలో ఐసొలేషన్‌ వార్డు, పడకలు, ఐసీయూ విభాగానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఇక్కడ దాదాపు 1500 బెడ్లు అందుబాటులోకి రానున్నాయి. అనంతరం మం త్రులు మొయినాబాద్‌లోని భాస్కర్‌ మెడికల్‌ కాలేజీని సందర్శించారు. ఈ కాలేజీని కూడా కరోనా బాధితుల కోసం సిద్ధం చేస్తున్నారు. రోగుల సంఖ్య పెరిగితే అందుబాటులో ఉండేందుకు రాష్ట్రంలోని 22 మెడికల్‌ కాలేజీలను సిద్ధం చేస్తున్నామని మంత్రులు కేటీఆర్‌, ఈటల తెలిపారు. ఈ నెల 10వ తేదీ నుంచి వీటిలో కరోనా రోగులకు చికిత్స అందిస్తామని చెప్పారు. మంత్రులవెంట ఆయా ప్రభుత్వ శాఖల అధికారులు, వైద్యవిభాగాల అధిపతులు ఉన్నారు.

బాధితులకు భరోసా

  • ట్విట్టర్‌లో విజ్ఞప్తులకు మంత్రి కేటీఆర్‌ తక్షణ స్పందన


ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో ఎప్పుడూ ముందుండే ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ తన సహృదయాన్ని మరోసారి చాటుకొన్నారు. న్యూజిలాండ్‌లో ఉన్న అనీల్‌.. తన తల్లికి అత్యవసరంగా బైపాస్‌ సర్జరీ చేయాల్సి ఉన్నదని, ఆమె విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వచ్చేందుకు ప్రయాణ అనుమతి ఇప్పించాలని విజ్ఞప్తిచేశారు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్‌.. వెంటనే ఆమెకు కావాల్సిన సౌకర్యం కల్పించాలని తన కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు. అలాగే లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిండు గర్భిణిగా ఉన్న తన సోదరికి అత్యవసర వైద్యసదుపాయం కల్పించాలని రాజేందర్‌రెడ్డి వ్యక్తి చేసిన విజ్ఞప్తిపై మంత్రి కేటీఆర్‌ స్పందించారు. ఆమెకు తప్పకుండా వైద్యసదుపాయం కల్పిస్తామని కేటీఆర్‌ భరోసా ఇచ్చారు.

హైదరాబాద్‌.. నవచైతన్య నగరం

ప్రపంచ మనోజ్ఞతను, నూతన చైతన్యాన్ని కలిగివున్న నగరం మన హైదరాబాద్‌ అని మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిర్మానుష్యంగా మారిన హైదరాబాద్‌ నగరంపై చిత్రీకరించిన వీడియోను ఆయన ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నారు. ఎంతో అందంగా ఈ వీడియోను చిత్రీకరించిన సత్య దూలంను ఆయన అభినందించారు. 

మహిళా సర్పంచ్‌.. సిటిజెన్‌ హీరో

మహబూబాబాద్‌ జిల్లా నర్సింహులపేట్‌ మండలంలోని గోపతండాకు చెందిన మహిళా సర్పంచ్‌ అజ్మీరా లక్ష్మిని ‘సిటిజెన్‌ హీరో’గా మంత్రి కేటీఆర్‌ అభివర్ణించారు. పారిశుద్ధ్య కార్మికులతో కలిసి గ్రామంలో క్రిమిసంహారక మందులు పిచికారీ చేస్తున్న అజ్మీరా లక్ష్మి.. కరోనా వైరస్‌పై పోరాటాన్ని ముందుండి నడిపిస్తున్నారని మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌లో కొనియాడారు.


logo