15 మెగావాట్ల సోలార్ విద్యుత్ అనుసంధానం

హైదరాబాద్ : సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో చేపట్టిన సోలార్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణాలను సీఎండీ ఎన్.శ్రీధర్ చొరవతో పూర్తిచేస్తూ దశల వారీగా గ్రిడ్‌కు అనుసంధానం చేస్తున్నారు. తాజాగా రామగుండం- 3 ఏరియాలో నిర్మిస్తున్న 50 మెగావాట్ల సోలార్ ప్లాంటులో 15 మెగావాట్ల విభాగం ప్లాంట్ నుంచి విద్యుత్ ఉత్పత్తిని శుక్రవారం ప్రారంభించారు. సింగరేణి డైరెక్టర్ (ఈ అండ్ ఎం) డి.సత్యనారాయణరావు స్విచ్ ఆన్‌చేసి విద్యుత్‌ను 132 కేవీ సబ్ స్టేషన్‌కు అనుసంధానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సింగరేణిలో మూడు దశల్లో మొత్తం 300 మెగావాట్ల సోలార్ ప్లాంటుల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. రామగుండం 3 ఏరియాలో నిర్మిస్తున్న 50 మెగావాట్ల ప్లాంటులు పూర్తయితే సింగరేణికి ఏటా రూ.17 కోట్ల విద్యుత్ ఖర్చులు ఆదా కానున్నాయని వెల్లడించారు.
ఈ ప్రాంతంలో గనుల అవసరాలు, కాలనీ అవసరాలకు యేటా 220 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ట్రాన్స్‌కో నుంచి కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. ఇక్కడ 50 మెగావాట్ల సోలార్ ప్లాంటులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే 85 మిలియను యూనిట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి అవుతుందని, దీంతో రాష్ట్ర ట్రాన్స్ కో నుంచి విద్యుత్ కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదని తెలిపారు. ట్రాన్స్‌కో ద్వారా కొనుగోలు చేస్తున్న యూనిట్ విద్యుత్‌కు రూ.5.65 సంస్థ చెల్లిస్తుండగా, సింగరేణి ఉత్పత్తి చేస్తున్న యూనిట్ సోలార్ రూ. విద్యుత్‌కు 3.54 మాత్రమే ఖర్చు అవుతుందన్నారు.
దీంతో యేటా రూ. 17 కోట్లు ఆదా అవుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో రామగుండం -3 ఏరియా జీఎం కె.సూర్యనారాయణ, అడ్రియాల జీఎం ఎన్వీకే.శ్రీనివాసరావు, సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ఈడీ సంజయ్ కుమార్ సూర్, సోలార్ జీఎం డీవీఎస్ఎన్ రాజు, సోలార్ కన్సల్టెంట్ మురళీధరన్, ఎస్ఈ సీహెచ్.ప్రభాకర్, ట్రాన్స్ కో కరీంనగర్ ఎస్ఈ శ్రీనివాస్, బీహెచ్ఈఎల్. ప్రతినిధి సుభాష్ ధన్వాల్కర్, టీబీజీకేఎస్. జనరల్ సెక్రటరి మిర్యాల రాజిరెడ్డి, ఏరియా ఇంజినీర్ రామలింగం, రీజనల్ సోలార్ ఇంజినీర్శ్రీనివాస్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.