శనివారం 30 మే 2020
Telangana - May 21, 2020 , 01:05:30

బీజేపీ సర్కార్‌ది మోసం

బీజేపీ సర్కార్‌ది మోసం

  • మాటలు తప్ప చేతలు లేవు
  • ప్యాకేజీలవల్ల ఒరిగేదేమీ లేదు
  • 1200 కోట్లతో మంజీరాపై 15 చెక్‌డ్యాంలు
  • త్వరలో ఉమ్మడి మెదక్‌కు కాళేశ్వరం ఫలితం 
  • రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు

మెదక్‌, నమస్తే తెలంగాణ: కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం ప్రజలను వంచిస్తున్నదని, నిట్టనిలువునా దోపిడీకి గురిచేస్తున్నదని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. కరోనా కారణంగా రాష్ర్టాలు ఆర్థిక సంక్షోభంలోపడి కొట్టుమిట్టాడుతుంటే కేంద్రం ప్యాకేజీల పేరిట అంకెలగారడీ చేస్తున్నదని మండిపడ్డారు. ప్రధాని మోదీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్లు ఏమైనట్టు ఎక్కడికి పోయినట్టు అని ఆయన ప్రశ్నించారు. మెదక్‌ జిల్లాలో బుధవారం ఆయన పలు అభివృద్ధిపనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. కనీసం ఒక్క కరోనా బాధితుడిని, వలస కార్మికుడిని ఆదుకోలేని బీజేపీ ప్రభుత్వానివి మాటలుతప్ప చేతలులేవని ఎద్దేవా చేశారు. కరోనాతో దేశం మొత్తం విలవిల్లాడుతుంటే ఒక్క పైసా కూడా ఇవ్వకుండా తానే ఒరగబెట్టినట్టు ప్యాకేజీలు ప్రకటించడం ప్రజలను మోసం చేయడమేనని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కులవృత్తులను ఆదుకున్న దాఖలాలు ఎక్కడా లేవన్నారు. రైతులకు మద్దతుధర ఇస్తూ, వారిని కంటికి రెప్పలా రాష్ట్ర ప్రభుత్వం కాపాడుకుంటున్నదని చెప్పారు. కేంద్రం ఇప్పటికైనా వలస కార్మికులను ఆదుకోవాలని సూచించారు. 

రూ.1200 కోట్లతో మంజీరా నదిపై 15 చెక్‌డ్యాంలు 

మంజీరా నదిపై రూ.1200 కోట్లతో 15 చెక్‌డ్యాంలు నిర్మిస్తున్నా మని, వీటి ద్వారా 25 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. కాళేశ్వరం తొలి ఫలితం మరికొద్ది రోజుల్లో మెదక్‌ అందుకోబోతున్నదని, కొండపోచమ్మసాగర్‌కు నీరు వచ్చిన వెంటనే హల్దీ ద్వారా బొల్లారం మత్తడికి వస్తాయని తెలిపారు.మంజీరా నదిపై 60 ఏండ్లలో కాంగ్రెస్‌, టీడీపీలు ఒక్క చెక్‌డ్యాం కూడా మంజూరు చేయలేదని విమర్శించారు. ‘నీళ్లన్నీ ఆంధ్రకు కావాలి. చెక్‌డ్యాంలు ఇక్కడ కడితే నీళ్లు రావన్న కుట్రతో, కక్షతో సమ్యైవాదులు చెక్‌డ్యాం లు కట్టనివ్వలేదు’ అని చెప్పారు. తెలంగాణ వచ్చాక టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మంజీరా నదిపై 15 చెక్‌డ్యాంలు నిర్మిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనని చెప్పారు.  మంత్రి వెంట ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, సోలిపేట రామలింగారెడ్డి ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, కలెక్టర్‌ ధర్మారెడ్డి, అదనపు కలెక్టర్‌ నగేష్‌ తదితరులు ఉన్నారు.


logo