సోమవారం 13 జూలై 2020
Telangana - Jun 08, 2020 , 02:28:51

ఒక్కరోజే 14 మంది మృతి

ఒక్కరోజే 14 మంది మృతి

  • కొత్తగా 154 మందికి పాజిటివ్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో ఆదివారం కొత్తగా 154 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇందులో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 132 మంది ఉండగా, రంగారెడ్డి 12, మేడ్చల్‌ 3, యాదాద్రి 2, సిద్దిపేట 1, మహబూబాబాద్‌ 1, సంగారెడ్డి 1, నాగర్‌కర్నూల్‌ 1, కరీంనగర్‌ ఒకరు ఉన్నారు. ఒక్కరోజే 14 మంది మృత్యువాతపడ్డారు. వైరస్‌ లక్షణాలు ముందుగా బయట పడకపోవడం, కరోనాతోపాటు ఇతర అనారోగ్య లక్షణాల కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 3,650 కేసులు నమోదు కాగా, ఇందులో 137 మంది మరణించారు. 1,742 మంది చికిత్సద్వారా కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మిగిలిన 1,771 మంది గాంధీలో చికిత్స పొందుతున్నట్టు ప్రజారోగ్యశాఖ బులెటిన్‌లో పేర్కొన్నది. 

ఢిల్లీలో ఏపీ భవన్‌ ఉన్నతాధికారికి కరోనా

ఢిల్లీలోని ఏపీ భవన్‌ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారికి ఆదివారం కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. ఢిల్లీలో ఆర్మీ బేస్‌ దవాఖానలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఏపీ భవన్‌ను అధికారులు శానిటైజ్‌ చేశారు. అనంతరం ఆంధ్రా, తెలంగాణ రెసిడెంట్‌ కమిషనర్‌ కార్యాలయాలకు తాళంవేశారు. ఐఏఎస్‌ అధికారి ప్రైమరీ కాంటాక్ట్స్‌ను గుర్తించే ప్రక్రియ కొనసాగుతున్నది. కాంటాక్ట్స్‌ను హోంక్వారంటైన్‌లో ఉండాలని ఏపీ భవన్‌ అధికారులు ఆదేశాలు జారీచేశారు. ఢిల్లీలోని ఓ జర్నలిస్టుకు కరోనా సోకినట్టు తెలుస్తున్నది. దీంతో మీడియా సెంటర్‌ను అధికారులు సీల్‌వేశారు.

వైద్యులు, కానిస్టేబుళ్లకు వైరస్‌

హైదరాబాద్‌ శివారులోని బడంగ్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని మల్లాపూర్‌ బాలాజీ టౌన్‌సీప్‌లో ఉండే ఉస్మానియా వైద్యుడికి, గుర్రంగూడ సాయి హోమ్స్‌ ఫేస్‌-2లో ఉంటున్న కానిస్టేబుల్‌కు, మీర్‌పేట అధిత్యనగర్‌లో ఉంటున్న కానిస్టేబుల్‌, బడంగ్‌పేట షిర్డీ ఇన్‌క్లేవ్‌లో ఉంటున్న ఉస్మానియా వైద్యురాలికి కరోనా పాజిటివ్‌ వచ్చిన్నట్టు అధికారులు తెలిపారు. గాంధీ దవాఖానలో పనిచేస్తున్న బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌- 12లోని ఎన్‌బీటీనగర్‌లో ఉంటున్న వైద్యురాలికి పాజిటివ్‌గా తేలగా, హోం క్వారంటైన్‌ చేశారు. నిలోఫర్‌ దవాఖానలో పనిచేస్తున్న బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌- 11లోని  రాఘవ రెసిడెన్సీలో పేయింగ్‌ గెస్ట్‌గా ఉంటున్న వైద్యురాలికి వైరస్‌ సోకింది. ఫిలింనగర్‌లోని అపోలో దవాఖానలోని బిల్లింగ్‌ విభాగంలో రిసెప్షనిస్టుగా పనిచేస్తున్న యువకుడికి పాజిటివ్‌గా తేలింది. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌- 12లోని సయ్యద్‌నగర్‌కు చెందిన డ్రైవర్‌కు వైరస్‌ సోకింది. హైదరాబాద్‌ బోడుప్పల్‌ కార్పొరేషన్‌లోని చెంగిచెర్ల కనకదుర్గకాలనీలో ఉంటూ యాదగిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌కు పాజిటివ్‌ వచ్చింది. హైదరాబాద్‌ గడ్డిఅన్నారంలోని ఓ బ్యాంకు మేనేజర్‌కు కరోనా లక్షణాలు కనిపించడంతో జీహెచ్‌ఎంసీ అధికారులు గాంధీకి తరలించారు. పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆయన కుటుంబుసభ్యులను క్వారంటైన్‌ చేశారు. 


logo