సోమవారం 01 జూన్ 2020
Telangana - May 22, 2020 , 00:21:30

పట్టాలెక్కనున్న 26 రైళ్లు

పట్టాలెక్కనున్న 26 రైళ్లు

  • -దక్షిణమధ్య రైల్వేలో 13 రైళ్లు.. ఆన్‌లైన్‌ బుకింగ్‌ షురూ

హైదరాబాద్‌/కంటోన్మెంట్‌, నమస్తే తెలంగాణ: జూన్‌ ఒకటి నుంచి జోన్‌ పరిధిలో 13 (రెండు వైపులా 26) రైళ్లు సేవలందిస్తాయని దక్షిణ మధ్య రైల్వే గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. సికింద్రాబాద్‌, నాంపల్లి, కాచిగూడల నుంచి రైళ్లు నడుస్తాయని, ఇందుకోసం గురువారం ఆన్‌లైన్‌ బుకింగ్‌ను ప్రారంభించినట్టు పేర్కొన్నది. ఇందులో తొమ్మిది రైళ్లు జోన్‌నుంచి, నాలుగు రైళ్లు జోన్‌ మీదుగా వెళ్తాయని వెల్లడించింది. గతంలో ఆగిన స్టేషన్లలోనే ఇప్పుడు కూడా ఆ రైళ్లు ఆగుతాయని తెలిపింది. ఇందులో పూర్తిగా రిజర్వేషన్‌ గల ఏసీ, నాన్‌ఏసీ తరగతులు ఉంటాయని, తత్కాల్‌ లేదా ప్రీమియం బుకింగ్‌ వర్తించదని తెలిపింది. ఐఆర్సీటీసీ వెబ్‌సైట్‌ లేదా మొబైల్‌ యాప్‌ ద్వారా మాత్రమే టికెట్లు పొందవచ్చని వెల్లడించింది. సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి బయలుదేరే రైళ్లను రసాయనాలతో శుభ్రపరుస్తారు. టికెట్‌ కన్ఫర్మ్‌ అయిన ప్రయాణికులనే థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహించాక రైల్వేస్టేషన్‌లోకి అనుమతిస్తామని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్యా తెలిపారు. మరోవైపు, ప్రత్యేక రైళ్లలో రిజర్వేషన్ల బుకింగ్‌కు వీలుగా దక్షిణ మధ్యరైల్వే శుక్రవారంనుంచి 73 స్టేషన్లలో కౌంటర్లను ప్రారంభించ నుంది. వీటిలో తెలంగాణలో 19, ఏపీలో 43 కౌంటర్లు ఉన్నాయి. రాష్ట్రంలో సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, కాచిగూడ, వికారాబాద్‌, తాండూర్‌, కాజిపేట, పెద్దపల్లి, మంచిర్యాల, సిర్పూర్‌కాగజ్‌నగర్‌, మహబూ బాబాద్‌, ఖమ్మం, నల్లగొండ, మిర్యాలగూడ, కామారెడ్డి, నిజామాబాద్‌, రామన్నపేట స్టేషన్లలో రిజర్వేషన్‌ కౌంటర్లుంటాయి.
logo