శుక్రవారం 23 అక్టోబర్ 2020
Telangana - Sep 25, 2020 , 12:16:20

హేమంత్‌ హత్య కేసులో 13 మంది అరెస్టు..

హేమంత్‌ హత్య కేసులో 13 మంది అరెస్టు..

హైదరాబాద్‌ : హేమంత్‌ హత్య కేసులో 13 మందిపై కేసు నమోదు చేసినట్లు మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు.  అవంతి బంధువులే హత్యలో కీలకపాత్ర పోషించారని ఆయన పేర్కొన్నారు. నిందితులు లక్ష్మారెడ్డి, యుగంధర్‌రెడ్డి, రాకేశ్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి, విజేందర్‌రెడ్డి, సంతోశ్‌రెడ్డితోపాటు స్పందన, స్వప్న, రజిత, అర్చనలతోపాటు యువతి తల్లిదండ్రులే హత్య చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు ఈ కేసులో కారు డ్రైవర్‌తో సహా 13 మందిని అరెస్టు చేశామని వెల్లడించారు. యువతి కుటుంబ సభ్యులు మినహా హత్యలో బయటి వ్యక్తుల ప్రమేయం లేదని తేల్చి చెప్పారు.

గురువారం యువతి తండ్రి లక్ష్మారెడ్డి ఆమె మేనమామ యుగంధర్‌రెడ్డితోపాటు కుటుంబీకులు మూడు కార్లలో వచ్చి మాట్లాడతామని చెప్పి హేమంత్‌ దంపతులను చందానగర్‌ వైపునకు తీసుకెళ్లారు. అనుమానం వచ్చి మార్గమధ్యలో గోపన్‌పల్లి వద్ద దంపతులిద్దరూ కారు నుంచి దూకి పారిపోయేందుకు యత్నించారు. హేమంత్‌ను వెంబడించిన యుగంధర్‌రెడ్డి మరో ఇద్దరు వ్యక్తులసాయంతో అతడిని అపహరించాడు. అవంతి పోలీసులకు సమాచారం అందించడంతో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నాం. కిడ్నాప్‌ కేసు నమోదు చేసి వారిని విచారించాం. సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా హేమంత్‌ ఆచూకీ గుర్తించేందుకు యత్నించగా ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేయడంతో గుర్తించలేకపోయామని డీసీపీ చెప్పారు. ఎక్కడా పోలీసుల వైఫల్యం లేదని, యుగంధర్‌రెడ్డి సెల్‌ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసి ఉండకపోతే దారుణం జరిగి ఉండేది కాదని ఆయన పేర్కొన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo