గురువారం 02 జూలై 2020
Telangana - Jun 04, 2020 , 01:28:11

కొత్తగా 129 మందికి కరోనా

కొత్తగా 129 మందికి కరోనా

  • ఏడుగురి మృతి, 30 మంది డిశ్చార్జి
  • గాంధీలో ప్లాస్మా థెరపీ విజయవంతం
  • కోలుకున్న ఐదుగురు బాధితులు
  • నిమ్స్‌లో నలుగురు వైద్యులు, ముగ్గురు టెక్నిషియన్లకు వైరస్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో బుధవారం కొత్తగా 129 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇందులో జీహెచ్‌ఎంసీలోనే 108 కేసులు నమోదుకాగా, రంగారెడ్డి 6, ఆసిఫాబాద్‌ 6, మేడ్చల్‌ 2, సిరిసిల్ల 2, యాదాద్రి భువనగిరి 1, కామారెడ్డి 1, మహబూబ్‌నగర్‌ 1 చొప్పున వెలుగుచూశాయి. ఇతర రాష్ర్టాల నుంచి వలస వచ్చిన కార్మికుల్లో ఇద్దరికి వైరస్‌ సోకింది. చికిత్స ద్వారా కోలుకున్న 30 మంది డిశ్చార్జి కాగా, ఏడుగురు మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,020కి చేరగా, ఇందులో 99 మంది మరణించారు. 1,556 మంది డిశ్చార్జి అయ్యారు. మిగిలిన 1,365 మంది దవాఖానలో చికిత్స పొందుతున్నట్టు ప్రజారోగ్యశాఖ బులెటిన్‌లో పేర్కొన్నది. 

కాగా, కరోనా పాజిటివ్‌ వ్యక్తులకు ఐసీఎమ్మార్‌ మార్గదర్శకాల మేరకు గాంధీ దవాఖానలో చేపట్టిన ప్లాస్మా థెరపీ విజయవంతమైంది. మే 14న మొదటిసారి, అదే నెల 16న రెండోసారి ప్లాస్మా ఎక్కించిన 44 ఏండ్ల వ్యక్తి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఈ క్రమంలో ఐసీఎమ్మార్‌ అనుమతితో మరో నలుగురికి ప్లాస్మా ఎక్కించడంతో వారు కూడా పూర్తిగా కోలుకున్నారు. దీంతో ప్లాస్మా థెరపీ ద్వారా గాంధీలో పూర్తి ఆరోగ్యవంతులైన వారిసంఖ్య అయిదుకు చేరింది. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న కరోనా రోగులకు గాంధీలో డయాలిసిస్‌ సేవలను అందిస్తున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన విభాగాల్లో కేవలం కరోనా పాజిటివ్‌ వ్యక్తుల్లో అవసరమైన వారికోసం 75 డయాలిసిస్‌ యూనిట్లను వైద్యారోగ్యశాఖ ఏర్పాటుచేసింది. నిమ్స్‌ దవాఖానలో ఏడుగురు కరోనా బారిన పడ్డారు. దవాఖానాలో నలుగురు వైద్యులు, ముగ్గురు క్యాథ్‌ ల్యాబ్‌ టెక్నీషియన్లకు పాజిటివ్‌ వచ్చింది. దీంతో వీరిని నిమ్స్‌ మిలీనియనం బ్లాక్‌ మొదటి అంతస్థులోని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

జర్నలిస్టులకు మీడియా అకాడమీ ఆర్థికసాయం

హైదరాబాద్‌లో కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిన ముగ్గురు జర్నలిస్టులకు మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ రూ.20 వేల చొప్పున ఆర్థికసాయాన్ని అందజేశారు. ఇప్పటివరకు ఢిల్లీ, జోగుళాంబ గద్వాల, హైదరాబాద్‌లలో వైరస్‌ నిర్ధారణ అయిన 10 మంది జర్నలిస్టులకు రూ.20 వేల చొప్పున, క్వారంటైన్‌లో ఉంటున్న 11 మందికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.3.10 లక్షలు మీడియా అకాడమీ నిధుల నుంచి అందజేశామని చెప్పారు. జర్నలిస్టులకు మీడియా అకాడమీ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీఇచ్చారు.

రాష్ట్రంలో కరోనా కేసుల వివరాలు

వివరాలు    
 బుధవారం
మొత్తం 
పాజిటివ్‌కేసులు
129
3,020  
డిశ్చార్జి అయినవారు
301,556
మరణాలు
799
చికిత్స పొందుతున్నవారు1,365

logo