ఆదివారం 24 జనవరి 2021
Telangana - Dec 29, 2020 , 01:49:37

జీఎస్టీ నిధులు 129 కోట్లు విడుదల

జీఎస్టీ నిధులు 129 కోట్లు విడుదల

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ : రాష్ర్టాలకు చెల్లించాల్సిన జీఎస్టీ పరిహారం కింద కేంద్ర ఆర్థికశాఖ తొమ్మిదో విడుతగా రుణాలను విడుదల చేసింది. మొదటి ఆప్షన్‌ ఇచ్చిన అన్ని రాష్ర్టాలకు కలిపి రూ.6000 కోట్లు విడుదలయ్యాయి. ఇందులో తెలంగాణకు రూ.129.57కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.119.82కోట్లు వచ్చాయి. చట్ట ప్రకారం రాష్ర్టాలు నష్టపోతున్న మొత్తాన్ని కేంద్రం భరించాలి. కానీ ఆ నష్టాన్ని రుణం రూపంలో ఇస్తామని ఆప్షన్‌ ఇచ్చిన నేపథ్యంలో రాష్ర్టాలు రుణం తీసుకొనేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో అంగీకరించాయి. రాష్ట్ర ప్రభుత్వాల జీఎస్డీపీ(మొత్తం సంపద)ను బట్టి పొందే రుణ నిష్పత్తిలో అదనంగా మరో 0.5శాతం స్పెషల్‌విండో ఫండ్‌ కింద తీసుకొనేందుకు కేంద్రం అవకాశమిచ్చింది. ఇందులో భాగంగా తెలంగాణకు అదనంగా రూ.5,017 కోట్ల రుణం తీసుకునే వీలు కలిగింది. ఈ క్రమంలో తెలంగాణకు ఇప్పటివరకు దశల వారీగా రూ.818కోట్లు విడుదలయ్యాయి. జీఎస్టీ నష్టపరిహారానికి బదులుగా కేంద్రం ఇప్పటివరకు అన్ని రాష్ర్టాలకు కలిపి రూ.54వేల కోట్ల రుణం ఇచ్చింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు 1307.43కోట్లు, తెలంగాణకు 818.16 కోట్లు విడుదలయ్యాయి. ఇదిలా ఉండగా  కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్థంగా అమలుచేస్తున్న రాష్ర్టాలకు అదనపు రుణాలు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం మరింత వెసులుబాటు కల్పించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోపాటు కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్‌ రాష్ర్టాలకు ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని మించి రూ.16,728కోట్ల మేరకు రుణాలు సేకరించడానికి అవకాశం కల్పిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ అనుమతులను జారీచేసిన విషయం తెలిసిందే. ఇందులో తెలంగాణకు ప్రస్తుతం ఉన్న పరిమితి కంటే మరో రూ.2,508కోట్లు రుణం తీసుకునే అవకాశం కలిగింది. logo