బుధవారం 03 జూన్ 2020
Telangana - Apr 02, 2020 , 00:17:47

అలమటించకుండా..

అలమటించకుండా..

  • పేదలకు అందుతున్న 12 కిలోల ఉచిత బియ్యం
  • మొదటిరోజు హైదరాబాద్‌లో 364916 కిలోలు పంపిణీ
  • కూపన్ల జారీతో ఇబ్బందులకు చెక్‌

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: కరోనా మహమ్మారి నేపథ్యంలో పేదలు పస్తులుండద్దనే లక్ష్యంతో ప్రకటించిన ఉచిత 12 కిలోల బియ్యం పంపిణీ హైదరాబాద్‌ నగరంలోని  9 సర్కిళ్ళలో మొదటిరోజు  విజయవంతమైంది.  మొత్తం 67 దుకాణాల్లో బుధవారం ఒక్కరోజు  3,64,916 కిలోల బియ్యాన్ని పంపిణీ చేశారు. స్వయంగా సీఆర్వో బాలమాయాదేవి పాల్గొని లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేశారు. కరోనా నేపథ్యంలో సోషల్‌ డిస్టెన్స్‌ పాటించేలా ముందస్తు చర్యలు తీసుకున్న హైదరాబాద్‌ సీఆర్వో కార్యాలయం కూపన్లు అందచేసి పంపిణీ కేంద్రాల వద్ద ముగ్గువేసిన బాక్సులు ఏర్పాటు చేసి క్యూ పద్ధతిన రేషన్‌ పంపిణీ చేశారు.  హైదరాబాద్‌లోని మొత్తం 675 రేషన్‌ దుకాణాల ద్వారా రోజుకు 67500  టోకెన్ల ఉచిత బియ్యం పంపిణీ చేయనున్నారు. 

బియ్యం పంపిణీ చేసే డీలర్లు, వర్కర్లు, సిబ్బంది, అధికారులు శానిటైజేషన్‌ పాటించారు. మాస్కులు వేసుకుని, గ్లౌజులు వేసుకుని దూరం పాటిస్తూ పంపిణీ ప్రక్రియ ప్రారంభించారు. పంపిణీ చేసిన బియ్యం కోటాలో పోర్టబిలిటీ కూడా ఉన్నాయి. ఇతర జిల్లాలకు చెందిన లబ్ధిదారులకు ఇక్కడ పంపిణీ చేసినట్లు బాలమాయాదేవి తెలిపారు. మేడ్చల్‌ జిల్లాలో మొత్తం 632 రేషన్‌ షాపులుండగా, 169 షాపులలో సుమారు 9 వేల రేషన్‌ కార్డులలోని 26,375 మంది లబ్ధిదారులకు 12 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేశామని జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ విద్యాసాగర్‌ తెలిపారు. గురువారం జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోను రేషన్‌ బియ్యం పంపిణీ జరుగుతుందని, ప్రతిరోజు ఒక్కో షాపు పరిధిలో సుమారు 100-150 మందికి టోకెన్లు ఇస్తున్నామని ఆయన తెలిపారు. 

లాక్‌డౌన్‌ నేపథ్యంలో గ్రేటర్‌ వ్యాప్తంగా  పలు నియోజకవర్గాల్లో  రేషన్‌కార్డు  లబ్ధిదారులకు, వలస కార్మికులకు  బియ్యం పంపిణీ విజయవంతంగా సాగింది. రేషన్‌ లబ్ధిదారులకు  ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున  బియ్యాన్ని , రూ.1500 చొప్పున వారి బ్యాంక్‌ అకౌంట్‌లో  జమ చేశారు. వలస కార్మికులకు  ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున  బియ్యాన్ని , రూ.500 నగదును అందచేశారు. బోయిన్‌పల్లిలోని చిన్నతోకట్టలోని చౌకధరల దుకాణంలో,  పీర్జాదిగూడ నగరపాలక సంస్థలో  వలస కార్మికులకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి  బియ్యం పంపిణీ చేశారు.  డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌ ఏసీఎస్‌నగర్‌లో  వలస కార్మికుల శిబిరాన్ని ప్రారంభించారు. 


సొంత డబ్బులతో....

బోడుప్పల్‌ : నగర పాలక సంస్థ పరిధిలోని దేవేందర్‌ నగర్‌, చెంగిచర్ల చింతల బస్తీ డబుల్‌ బెడ్‌రూం సమీపంలోని నిరుపేదలకు మాజీ జెడ్పీటీసి మంద సంజీవరెడ్డి సొంత డబ్బుతో కొనుగోలు చేసిన  నిత్యావసరాలతో పాటు 500 చొప్పున నగదును మంత్రి మల్లారెడ్డి అందజేశారు.  

అంబర్‌పేటలో..

12 కిలోల బియ్యాన్ని బుధవారం ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌, కార్పొరేటర్‌ కాలేరు పద్మతో కలిసి గోల్నాక సాయిబాబా గుడి వద్ద గల రేషన్‌ షాపు వద్ద ప్రారంభించారు. 

ముషీరాబాద్‌లో..

గాంధీనగర్‌, కవాడిగూడ రేషన్‌ షాపుల్లో ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక కార్పొరేటర్‌ ముఠా పద్మానరేశ్‌ కలిసి ప్రారంభించారు. రాంనగర్‌ డివిజన్‌ పరిధిలో ఉన్న వలస కార్మికులకు స్థానిక కార్పొరేటర్‌ వీ శ్రీనివాస్‌ రెడ్డి 12 కీలోల బియ్యం,రూ.500 నగదు పంపిణీ చేశారు.

రాజేంద్రనగర్‌ సర్కిల్‌ చింతల్‌మేట్‌లో  బుధవారం కార్పొరేటర్‌ కోరని శ్రీలత మహాత్మతో కలిసి  వలస కూలీలకు  ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ బియ్యం పంపిణీ చేశారు.

ఖైరతాబాద్‌లోని చేపల మార్కెట్‌ వద్ద రేషన్‌ షాప్‌ (నంబర్‌ 702) వద్ద నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని తెలంగాణ సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఎం. శ్రీనివాస్‌ రెడ్డి బుధవారం స్థానిక కార్పొరేటర్‌ పి. విజయా రెడ్డితో కలిసి ప్రారంభించారు. 

పౌరసరఫరాల శాఖ సర్కిల్‌-6 పరిధిలో 6 షాపుల్లో రేషన్‌ బియ్యం పంపిణీ చేస్తున్నట్లు సర్కిల్‌-6 ఏఎస్‌ఓ బాల్‌ రాజ్‌ తెలిపారు. 675 గోల్నాక,  646 రాంనగర్‌, 694 పటేల్‌ నగర్‌, 634 హరిహర నగర్‌, 623 జవహర్‌నగర్‌, 611దోమలగూడ షాపుల్లో పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు షాపులు తెరిచి ఉంటాయని తెలిపారు. 

పోలీస్‌, వైద్య, ఆరోగ్య, ఆశ, పారిశుధ్య సిబ్బందికి  బండ్లగూడ విజ్ఞాన్‌ కళాశాల ఆధ్వర్యంలో  ఉచితంగా 10వేల కిట్లు (శానిటైజర్‌, గ్లౌజులు, మాస్కులు)  పంపిణీ చేశారు.logo