బుధవారం 08 జూలై 2020
Telangana - Jun 18, 2020 , 01:46:27

12.5 కోట్ల మొక్కలు లక్ష్యం

12.5 కోట్ల మొక్కలు లక్ష్యం

  • పచ్చదనం ఉట్టిపడేలా యాదాద్రి మోడల్‌
  • పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్‌
  • మున్సిపల్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఈ నెల 25 నుంచి ప్రారంభంకానున్న ఆరోవిడుత హరితహారంలో ముందు గా నిర్దేశించిన 2.5 కోట్ల మొక్కలు కాకుండా, ఈ ఏడాది 12.5 కోట్ల మొక్కలు నాటాలని పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్‌ ఆదేశించారు. బుధవారం మున్సిపల్‌ డైరెక్టర్‌ సత్యనారాయణతో కలిసి వీడియో కాన్ఫ్‌రెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే మూడు, 4 నెలల్లో పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం ఉట్టిపడేలా యాదాద్రి మోడల్‌ ప్లాంటేషన్‌ (మియావాకి పద్ధతి) చేపట్టాలని, మున్సిపాలిటీల్లో ట్రీ పార్కులు ఏర్పాటుచేయాలని స్పష్టంచేశారు. హెచ్‌ఎండీఏ పరిధిలో 5 కోట్ల మొక్కలు, జీహెచ్‌ఎంసీ పరిధిలో 2.5 కోట్ల మొక్కలు, సీడీఎంఏ  పరిధిలో 5 కోట్ల మొక్కల చొప్పున లక్ష్యాన్ని నిర్దేశించారు. ప్రభుత్వ ఖాళీ స్థలాలు, సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు ఆఫీస్‌ కాంప్లెక్సులు, విద్యా సంస్థల్లో ఎక్కువ మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధంచేయాలని ఆదేశించారు. స్టేట్‌, నేషనల్‌ హైవేల వెంబడి సెంట్రల్‌ మీడియన్‌తోపాటు రోడ్డుకు ఇరువైపులా మూడు వరుసల్లో మొక్కలునాటాలని సూచించారు. ఎవరికివారు తమ పరిధిలో ఉన్న క్వారీలు, డంప్‌ యార్డుల చుట్టూ ‘కీ రోల్‌' పద్ధతిలో పచ్చదనం పెంపునకు చర్యలు తీసుకోవాలన్నారు. జీహెచ్‌ఎంసీలోని కొన్ని ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన కనీసం 60 చోట్ల మియావాకీ పద్ధతిలో, మరో 60 పార్కులు అభివృద్ధిచేయాలని ఆదేశించారు. హెచ్‌ఎండీఏ నుంచి డ్రాఫ్ట్‌ లేఅవుట్‌ పర్మిషన్లు, ఫైనల్‌ లేఅవుట్‌ పర్మిషన్లు పొందిన వెంచర్లలో ఇంకా ఏ మేరకు ఖాళీ స్థలాల్లో వాటిలో మొక్కల పెంపకానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కాన్ఫ్‌రెన్సులో మున్సిపల్‌శాఖ కార్యదర్శి సుదర్శన్‌రెడ్డి, హెచ్‌ఎండీఏ యూఎఫ్‌డీ శ్రీనివాస్‌, హెచ్‌ఎండీఏ పీడీలు, సీడీఎంఏ ఏడీ పంకజం, జీహెచ్‌ఎంసీ ఏసీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


logo