నల్లగొండ : కరోనా సెకండ్ వేవ్ పాజిటివ్ కేసులు పెరగకుండా గ్రామ స్థాయి నుంచి వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది పోలీస్, రెవెన్యూ, పంచాయతీ రాజ్ శాఖల సమన్వయంతో కట్టుదిట్టంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ అధికారులను ఆదేశించారు. సోమవారం నల్లగొండ జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి హాలియాలో ఎంపీడీవో కార్యాలయంలో ప్రజారోగ్య సంచాలకులు డా.జి.శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి వైద్య ఆరోగ్య శాఖ మెడికల్ ఆఫీసర్ లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
జిల్లాలో కొవిడ్ కేసుల వ్యాప్తి, నియంత్రణ చర్యలపై పీహెచ్సీల వారీగా సమీక్షించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆదేశాల ననుసరించి హాలియాలో కొవిడ్ కేసులపై సమీక్ష నిర్వహిస్తున్నట్లు, సరిహద్దు ప్రాంతంలో కొవిడ్ కేసులు ఎక్కువగా పెరగకుండా నియంత్రణ చర్యలు తీసుకోవాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది బాగా పని చేస్తుందన్నారు. కొవిడ్ నియంత్రణకు ఇంకా అవగాహన కల్పించి చర్యలు తీసుకోవాలని అన్నారు.
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి మాట్లాడుతూ పట్టణ ప్రాంతాలలో అవగాహన,చైతన్యం తో కేసులు సంఖ్య తగ్గుతున్నట్లు, గ్రామీణ ప్రాంతాల పై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఆయన అన్నారు.
కొవిడ్ కేసులు ఎక్కువగా నమోదు అయిన ప్రాంతాలను హాట్ స్పాట్ లుగా గుర్తించి కరోనా నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు.
జిల్లాలో గ్రామాల్లో క్యాంపులు ఏర్పాటు చేసి కొవిడ్ పరీక్షలు నిర్వహించాలని, అదనపు టెస్ట్ కిట్ లు అవసరం ఉంటే సరఫరా చేయనున్నట్లు తెలిపారు. పెండ్లిళ్ళు జరిగే చోట దృష్టి సారించి లాక్ డౌన్ నిబంధనలు మేరకు సూచించిన సంఖ్య కంటే ఎక్కువ సంఖ్యలో హాజరైతే పోలీస్, రెవెన్యూ, పంచాయతీ రాజ్ శాఖలు సమన్వయంతో కేసులు నమోదు చేయాలన్నారు.
జిల్లాలో కొనసాగుతున్న ఫివర్ సర్వే మొక్కుబడి గా కాకుండా వైద్య సిబ్బంది కుటుంబంలో జ్వర పీడితులను గుర్తించాలని తెలిపారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ డి.సి.హెచ్.ఎస్. మాతృ నాయక్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.కొండల్ రావు, అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
రాఘవపూర్ పీహెచ్సీకి జాతీయ అవార్డు
సురేందర్ రెడ్డికి నివాళులు అర్పించిన ఎంపీ సంతోష్ కుమార్
అంతర్జాల వేదికగా..ఎన్టీఆర్కు ఘన నివాళులు
రాజద్రోహానికి పరిమితులను సెట్ చేయాల్సిందే: సుప్రీంకోర్టు
రైతులకు జనుము విత్తనాలు పంపిణీ
నారాయణపేట జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల పట్టివేత