గురువారం 09 ఏప్రిల్ 2020
Telangana - Mar 03, 2020 , 11:15:40

మూడేండ్ల బాలుడి శరీరంలో 11 సిరంజి సూదులు

మూడేండ్ల బాలుడి శరీరంలో 11 సిరంజి సూదులు

వనపర్తి : చిన్న పిల్లలకు తట్టు తగిలితేనే విలవిలలాడిపోతారు.. షార్ప్ పెన్సిల్, పెన్ను గుచ్చుకున్న గుక్కపట్టి ఏడుస్తారు.. అలాంటిది అభం శుభం తెలియని మూడేండ్ల బాలుడి శరీరంలో ఏకంగా 11 సిరంజి సూదులు ఉన్నాయి. ఆ సూదుల బాధతో 15 రోజుల నుంచి నరకయాతన అనుభవిస్తున్నాడు.

వీపనగండ్ల మండల కేంద్రానికి చెందిన పెబ్బేటి అశోక్‌, అన్నపూర్ణ దంపతులకు లోక్‌నాథ్‌(3) అనే కుమారుడు ఉన్నాడు. గత 15 రోజుల నుంచి తొడ, పిరుదుల భాగంలో తీవ్రమైన నొప్పి వస్తుందని బాలుడు బాధపడుతున్నాడు. దీంతో స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రిలో చూపించిన ఫలితం లేదు. బాలుడి మలద్వారం వద్ద ఉన్న ఓ సూదిని తల్లిదండ్రులే బయటకు తీశారు. అప్రమత్తమైన తల్లిదండ్రులు.. బాలుడిని తీసుకొని వనపర్తిలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి వెళ్లారు.

అక్కడ ఎక్స్ రే తీయగా.. తొడ, పిరుదుల భాగంలో 10 సిరంజి సూదులు ఉన్నట్లు గుర్తించారు. అయితే ఈ సూదులన్నింటినీ ఒకేసారి వెలికి తీయడం సాధ్యం కాకపోవడంతో.. నిన్న కొన్నింటిని తొలగించారు. మరికొద్ది రోజుల్లో మిగతా వాటిని తొలగిస్తామని వైద్యులు తెలిపారు. తాము అంటే గిట్టని వారే కావాలని సిరంజి సూదులను బాలుడి శరీరంలోకి గుచ్చి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు బాధిత బాలుడి తల్లిదండ్రులు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైద్యుల రిపోర్ట్‌ ఆధారంగా విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకుంటామని ఎస్సై వహీద్‌ అలీబేగ్‌ తెలిపారు.  


logo