ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Telangana - Aug 10, 2020 , 01:55:17

మంటల్లో కరోనా సెంటర్‌

మంటల్లో కరోనా సెంటర్‌

  • విజయవాడలో ఘోర విషాదం..
  • 11 మంది కొవిడ్‌ రోగుల మృతి
  • తెల్లవారుజామున ఘటన
  • దట్టంగా కమ్మేసిన పొగలు 
  • అక్కడికక్కడే ఏడుగురి మృతి
  • మృతుల కుటుంబాలకు 50 లక్షల చొప్పున పరిహారం 
  • ఏపీ సీఎం జగన్‌ ప్రకటన

అసలే తగినంత శ్వాస అందని కరోనా రోగులు.. ఎడతెగని దగ్గు దమ్ముతో ఉక్కిరిబిక్కిరయ్యే బాధితులు! అలాంటివారిని దట్టమైన పొగ కమ్మేసింది. తెల్లవారుజామున గాఢ నిద్రలో ఉన్న సమయంలో నలుదిశల నుంచి చుట్టుముట్టిన అగ్నిజ్వాలలు, నల్లని పొగలు అక్కడికక్కడే ఏడుగురి ఆయువు తీశాయి.  చికిత్స పొందుతూ మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర విషాదం ఏపీలోని విజయవాడలో ఒక ప్రైవేటు దవాఖాన హోటల్‌ను లీజుకు తీసుకుని నిర్వహిస్తున్న కొవిడ్‌ కేంద్రంలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకున్నది. 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో రమేశ్‌ హాస్పిటల్‌ యాజమాన్యం కొవిడ్‌కేర్‌ సెంటర్‌గా వినియోగిస్తున్న హోటల్‌ స్వర్ణ ప్యాలెస్‌లో ఆదివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నది. ప్రమాద సమయంలో హోటల్‌లో కరోనాకు చికిత్స పొందుతున్న 31 మందితోపాటు కొందరు  సిబ్బంది ఉన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేలోపు ఏడుగురు మృత్యువాత పడ్డారు. మరో నలుగురు చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. మృతి చెందినవారంతా కరోనా బాధితులే. వీరిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. షార్ట్‌సర్క్యూట్‌ వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఒక్కసారిగా మంటలు వ్యాపించడం, పొగలు కమ్మేయడంతో రోగులు శ్వాస తీసుకోవటానికి ఇబ్బంది పడుతూ కిటికీ లోంచి కేకలు వేశారు. భయాందోళనకు గురైన  నలుగురు ఒకటో అంతస్తు నుంచి కిందికి దూకేశారు. 

ఈలోపు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కిటికీ అద్దాలను పగలగొట్టి, నిచ్చెనల సాయంతో పలువురిని కిందికి తీసుకువచ్చారు. వారిని అక్కడినుంచి నేరుగా లబ్బీపేట, మెట్రోపాలిటన్‌ హోటల్‌ కొవిడ్‌కేర్‌ సెంటర్లకు తరలించారు. ఎక్కువమంది ఊపిరి ఆడక చనిపోయారని వైద్యులు తెలిపారు. పది మృతదేహాలకు కరోనా పరీక్షలు నిర్వహించగా, వారిలో 8 మందికి నెగెటివ్‌ వచ్చిందని, ఇద్దరే ఇంకా కరోనా లక్షణాలతో ఉన్నారని వెల్లడించారు. షార్ట్‌సర్క్యూట్‌ వల్లే ప్రమాదం సంభవించిందని ఏపీ హోం మంత్రి సుచరిత చెప్పారు. ప్రమాదానికి భద్రతా నిబంధనల ఉల్లంఘనే కారణమయి ఉండొచ్చని డైరెక్టర్‌ ఆఫ్‌ ఫైర్‌ సర్వీసెస్‌ జయరామ్‌ నాయక్‌ అన్నారు. తగిన నియమాలు పాటించి హోటల్‌ను నిర్మించకపోవడం వల్ల సహాయ చర్యలకు ఇబ్బంది ఏర్పడిందని అగ్నిమాపకశాఖ అధికారులు పేర్కొంటున్నారు. కాగా, రమేశ్‌ హాస్పిటల్స్‌, స్వర్ణాప్యాలెస్‌ యాజమాన్యాలపై పోలీసులు కేసులు నమోదుచేశారు.


ప్రమాదంపై కమిటీ ఏర్పాటు

ప్రమాదంపై కృష్ణాజిల్లా కలెక్టర్‌, ఇతర ఉన్నతాధికారులతో సమీక్షించిన అనంతరం ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని విలేకరులతో మాట్లాడారు. ప్రమాదంపై కమిటీ వేశామన్నారు. దవాఖానకు అన్ని అనుమతులు ఉన్నాయా లేదా? ప్రమాదానికి కారణాలేంటి? అనే అంశాలపై కమిటీ విచారణ జరుపుతుందని తెలిపారు. 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించినట్టు చెప్పారు. నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. అగ్ని ప్రమాదం దురదృష్టకరమని కృష్ణాజిల్లా కలెక్టర్‌ మహ్మద్‌ ఇంతియాజ్‌ అన్నారు. ప్రభుత్వ వైద్యశాలల్లో కరోనా రోగుల చికిత్సకు మెరుగైన సదుపాయాలు ఉన్నాయని, ప్రజలు వాటిని వినియోగించుకోవాలని కోరారు. 

మోదీ ఫోన్‌.. తీవ్ర దిగ్భ్రాంతి

ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ.. ముఖ్యమంత్రి జగన్‌కు ఫోన్‌ చేసి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధికారులు వెంటనే సహాయ చర్యలు చేపట్టినప్పటికీ.. దురదృష్టవశాత్తు కొందరు మృత్యువాత పడ్డారని మోదీకి జగన్‌ వివరించారు. ఘటనపై మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని ట్వీట్‌ చేశారు. మృతుల కుటుంబాలకు కేంద్రం ప్రభుత్వం తరఫున తలా రెండు లక్షల రూపాయలను నష్టపరిహారంగా అందిస్తామని పీఎంవో ప్రకటించింది. గాయపడినవారికి రూ.50వేల చొప్పున అందించనున్నట్టు తెలిపింది. ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ సైతం ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ తదితరులు ఈ ఘటనపై విచారం వ్యక్తంచేశారు.

మృతులకు రూ.50 లక్షల పరిహారం: సీఎం జగన్‌

అగ్నిప్రమాద ఘటనపై ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి ఆరా తీశారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు. ఒక్కో కుటుంబానికి రూ.50లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. 


logo