సోమవారం 13 జూలై 2020
Telangana - Jun 08, 2020 , 01:43:38

ఇంటర్నల్‌ ఆధారంగా టెన్త్‌ ఫలితాలు

ఇంటర్నల్‌ ఆధారంగా టెన్త్‌ ఫలితాలు

  • ట్రస్మా రాష్ర్ట అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు సూచన

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: విద్యార్థుల ఇంటర్నల్‌ మార్కుల ఆధారంగా టెన్త్‌ ఫలితాలు ప్రకటించాలని ట్రస్మా రాష్ర్ట అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు ప్రభుత్వానికి సూచించారు. పదో తరగతి పరీక్షలు వాయిదా వేయడాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న జీహెచ్‌ఎంసీ పరిధి మినహా రాష్ర్టంలోని మిగిలిన చోట్ల పరీక్షలు నిర్వహించవచ్చంటూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో రాష్ర్ట ప్రభుత్వం మొత్తానికే వాయిదావేయడం హర్షణీయమని తెలిపారు. 

తెలంగాణలోని మిగిలిన జిల్లాల్లో ఒకసారి, జీహెచ్‌ఎంసీ పరిధిలో మరోసారి పరీక్షలు నిర్వహించడం కంటే ప్రస్తుతానికి వాయిదావేసి, రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం భావించడం అభినందనీయమని తెలిపారు. ప్రస్తుతం కరోనా వైరస్‌ ఉధృతంగా ఉన్నదని, అది కొంచెం తగ్గుముఖం పట్టినప్పుడు పరీక్షలు జరుపకడం కన్నా ఇంటర్నల్‌ మార్కుల ఆధారంగా ఫలితాలు ప్రకటించాలని శేఖర్‌రావుతోపాటు ట్రస్మా ప్రధాన కార్యదర్శి సాదుల మధుసూదన్‌, కోశాధికారి నాగేశ్వరరావు ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. 

పంజాబ్‌ తరహాలో పరీక్షలు లేకుండానే గ్రేడ్లు ఇచ్చే విధానాన్ని పరిశీలించాలని విజ్ఞప్తిచేశారు. ‘ప్రస్తుతం కరోనా వల్ల హైదరాబాద్‌లో పరీక్షలకు హాజరుకాలేకపోయినవారికి సప్లిమెంటరీలో అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం చెప్పింది. వారిని కూడా రెగ్యులర్‌ కిందే పరిగణిస్తామని హామీఇచ్చింది. విద్యార్థుల ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని పరీక్షలు వాయిదావేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌, విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి చిత్రారామచంద్రన్‌కు కృతజ్ఞతలు’ తెలిపారు. 


logo