బుధవారం 08 జూలై 2020
Telangana - Jun 10, 2020 , 02:03:02

రెండువారాల్లోగా పదో తరగతి గ్రేడ్‌లు

రెండువారాల్లోగా పదో తరగతి గ్రేడ్‌లు

  • కసరత్తు మొదలుపెట్టిన ఎస్సెస్సీ బోర్డు

 హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రెండువారాల్లోగా పదో తరగతి విద్యార్థులందరికీ గ్రేడ్‌లు ఇచ్చేందుకు ఎస్సెస్సీ బోర్డు కసరత్తు చేస్తున్నది. ఆ వెంటనే సర్టిఫికెట్లను జారీచేసేలా ప్రణాళికలు రచిస్తున్నది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పదోతరగతి పరీక్షలను రద్దు చేయడంతో.. ఆ తర్వాత ప్రక్రియను బోర్డు అధికారులు ప్రారంభించారు. నాలుగు ఫార్మెటివ్‌ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్థులకు గ్రేడ్‌లు ఇవ్వనున్నారు. జూనియర్‌ కళాశాలల్లో ప్రవేశాల నోటిఫికేషన్‌ జూలైలో జారీచేయనున్న నేపథ్యంలో ఆలోగా విద్యార్థులందరికీ గ్రేడ్‌లకు సంబంధించిన సర్టిఫికెట్ల జారీకి అధికారులు ప్రణాళికలు సిద్ధంచేస్తున్నారు.

గ్రేడ్‌ల విధానం మంచిదే

పదో తరగతి విద్యార్థులందరినీ ప్రమోట్‌చేయడంతోపాటు వారికి గ్రేడ్‌లు ఇవ్వాలనే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మంచిదేనని తెలంగాణ గుర్తింపు స్కూల్‌ యాజమాన్యాల సంఘం (ట్రస్మా) రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు, ప్రధాన కార్యదర్శి మధుసూదన్‌ పేర్కొన్నారు. మంగళవారం విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఇంటర్నల్‌ మార్కుల ఆధారంగా ఇచ్చే గ్రేడింగ్‌లతో భవిష్యత్తులో విద్యార్థులెవ్వరికీ నష్టం ఉండబోదన్నారు. పరీక్షల కంటే ముందే ఇంటర్నల్‌ మార్కులు బోర్డుకు పంపామని పేర్కొన్నారు. పైగా ఎడిట్‌ ఆప్షన్‌ కూడా లేదని గుర్తుచేశారు. ఈ క్రమంలో డీఈవోలు మార్కులు కలుపుతారని వస్తున్న ఊహాగానాల్లో ఎలాంటి వాస్తవంలేదని స్పష్టంచేశారు.

గ్రేడ్ల ఆధారంగా అడ్మిషన్లు 

ఎస్సెస్సీ బోర్డు ఇచ్చే గ్రేడ్‌ల ఆధారంగా జూనియర్‌ కాలేజీల్లో అడ్మిషన్లు కొనసాగించాలని ఇంటర్‌బోర్డు అధికారులను తెలంగాణ ప్రైవేటు జూనియర్‌ కాలేజీ యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు గౌరి సతీశ్‌, ప్రధాన కార్యదర్శి తిరుపతిరెడ్డి కోరారు. పది విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్‌చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. 


logo