శుక్రవారం 05 జూన్ 2020
Telangana - Feb 26, 2020 , 13:41:55

జనగామలో 100 టాయిలెట్లు నిర్మించాలి : మంత్రి కేటీఆర్‌

జనగామలో 100 టాయిలెట్లు నిర్మించాలి : మంత్రి కేటీఆర్‌

జనగామ : రాబోయే రెండు నెలల్లో జనగామలో 100 టాయిలెట్లను నిర్మించాలని సంబంధిత అధికారులకు మున్సిపాలిటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా జనగామ పట్టణంలోని ధర్మకంచ బస్తీలో కేటీఆర్‌ పర్యటించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్‌ ప్రసంగించారు.

సీఎం కేసీఆర్‌ వల్లే జనగామ జిల్లా అయిందన్నారు. ప్రజల దగ్గరకే పరిపాలన తీసుకువచ్చామని కేటీఆర్‌ తెలిపారు. అన్ని పట్టణాల్లో పచ్చదనం - పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వార్డు కమిటీలు పారిశుద్ధ్య ప్రణాళికలు అమలు చేయాలన్నారు. ప్రతి ఇంటికి తడి, పొడి చెత్తను సేకరించేందుకు రెండు బుట్టలు ఇస్తామన్నారు కేటీఆర్‌. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించిన తర్వాత డంపింగ్‌ యార్డుల్లో రెండు రకాల కార్యక్రమాలు చేపడుతామని మంత్రి తెలిపారు. తడి చెత్తతో ఎరువులు తయారు చేసి జనగామ పట్టణ ప్రజలకు అందిస్తాం. తడి, పొడి చెత్త సేకరణకు రిక్షాల్లో కూడా వేర్వేరుగా డబ్బాలు ఏర్పాటు చేయాలని కేటీఆర్‌ ఆదేశించారు.

మన పిల్లల భవిష్యత్‌ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి అని మంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రజలకు కావాల్సిన మొక్కలను నర్సరీల ద్వారా అందజేస్తామన్నారు. నాటిన మొక్కల్లో 85 శాతం మొక్కలు బతికేలా చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణాల్లో వాటర్‌ ఆడిట్‌ చేయాల్సిన అవసరం ఉందని కేటీఆర్‌ తెలిపారు. పార్కుల నిర్మాణానికి ప్రభుత్వ స్థలాలను కేటాయిస్తామని చెప్పారు. 6 నెలల్లో విద్యుత్‌ స్తంభాలు, వేలాడే వైర్ల సమస్యలను పరిష్కరించాలి. అక్రమ లేఅవుట్లపై ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించారు. నివాస ప్రాంతాల్లో పందులు లేకుండా చేయాలన్నారు. అర్హులైన పేదలందరికీ డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు ఇస్తామని కేటీఆర్‌ చెప్పారు. పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు తీసుకొచ్చామని కేటీఆర్‌ పేర్కన్నారు. బీడీ కార్మికులకు పెన్షన్‌ ఇస్తున్న ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్‌ మాత్రమే అని కేటీఆర్‌ స్పష్టం చేశారు.  


logo