మంగళవారం 19 జనవరి 2021
Telangana - Dec 31, 2020 , 08:31:49

మెద‌క్ జిల్లాలో 90 రోజుల్లో 100 మంది మృతి

మెద‌క్ జిల్లాలో 90 రోజుల్లో 100 మంది మృతి

మెద‌క్ : ఉమ్మ‌డి మెద‌క్ జిల్లాలో గ‌త మూడు నెల‌ల నుంచి విషాదం అలుముకుంది. 90 రోజుల్లో 100 మంది మృతి చెందారు. వీరంతా నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయిన వారే. అక్టోబ‌ర్ ఒక‌టో తేదీ నుంచి సంభ‌వించిన‌ వ‌రుస ఘ‌ట‌న‌ల‌తో స్థానికులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌య్యారు. మృతుల్లో చాలా మంది చేప‌ల వేట‌కు వెళ్లిన వారే ఉన్నారు. ఆ త‌ర్వాత ప్ర‌మాద‌వ‌శాత్తు నీటిలో మునిగిపోయిన వారు ఉన్నారు.  

అత్య‌ధికంగా మెద‌క్ జిల్లాలో

మెద‌క్ జిల్లాలో అత్య‌ధికంగా 50 మంది, సంగారెడ్డిలో 36, సిద్దిపేట జిల్లాలో 14 మంది చ‌నిపోయారు. ఉమ్మ‌డి జిల్లాలోని ప్ర‌తి చెరువులో స‌గ‌టున ఒక‌రు చ‌నిపోయిన‌ట్లు తేలింది.  

స‌రైన అవ‌గాహ‌న‌ లేక‌పోవ‌డంతోనే

అయితే అక్టోబ‌ర్ నెల‌లో కురిసిన భారీ వ‌ర్షాల‌కు చెరువుల‌కు జ‌ల‌క‌ళ రావ‌డం, చేప‌లు కూడా వ‌ర‌ద‌ల కొట్టుకురావ‌డంతో.. స్థానికులు వాటిని ప‌ట్టేందుకు ఉత్సాహం చూపారు. చేప‌లు ప‌ట్టేందుకు వెళ్లిన వారు జాగ్ర‌త్త‌లు పాటించ‌క‌పోవ‌డం, ఆ చెరువుల లోతు గురించి స‌రైన అవ‌గాహ‌న లేక‌పోవ‌డంతోనే ప‌లువురు మృతి చెందారు. కొంద‌రైతే మ‌ద్యం సేవించి చేప‌ల ప‌ట్టేందుకు వెళ్ల‌డంతో.. నీటిలోకి వెళ్లిన త‌ర్వాత బ‌య‌ట‌కు రాలేక కూడా ప్రాణాలు కోల్పోయారు. చేప‌ల వ‌ల‌లో చిక్కుకుని క‌నీసం 12 మంది మ‌ర‌ణించారు.  

గ‌త మూడు నెల‌ల కాలంలో మ‌రో 12 మంది స్థానిక చెరువుల్లో దూకి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన‌ట్లు తేలింది. మెద‌క్ జిల్లాలో త‌క్కువ చెరువులు ఉన్న‌ప్ప‌టికీ సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల‌తో పోలిస్తే మెద‌క్ జిల్లాలోనే అత్య‌ధిక మ‌ర‌ణాలు సంభ‌వించాయి. అయితే ఈ మ‌ర‌ణాల‌కు సంబంధించి అధికారిక స‌మాచారం లేన‌ప్ప‌టికీ.. ఉమ్మ‌డి మెద‌క్ జిల్లాలోని చెరువుల్లో మునిగి 100 మంది మ‌ర‌ణించిన‌ట్లు వివిధ పోలీసు స్టేష‌న్ల‌లో కేసులు న‌మోదు అయ్యాయి.