బుధవారం 03 జూన్ 2020
Telangana - May 01, 2020 , 18:20:54

సూర్యాపేటలో కొత్తగా 10 మార్కెట్లు ఏర్పాటు!

సూర్యాపేటలో కొత్తగా 10 మార్కెట్లు ఏర్పాటు!

సూర్యాపేట : కరోనా వైరస్‌ నేపథ్యంలో సంభవించిన పరిణామాలను దృష్టిలో ఉంచుని కొత్తగా మరో 10 కూరగాయల మార్కెట్ల ఏర్పాటుకు అనువైన ప్రదేశాలను గుర్తించాలని సంబంధిత అధికారులను విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌ రెడ్డి ఆదేశించారు. సూర్యాపేట కలెక్టర్‌ కార్యాలయంలో జిల్లా స్థాయి అధికారులతో మంత్రి జగదీష్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనా వైరస్‌ కట్టడిలో అధికార యంత్రాంగం తీసుకున్న చర్యలు బాగున్నాయని ప్రశంసించారు. కరోనా వైరస్‌ ప్రబలకుండా ఉండేందుకు గానూ డ్రోన్‌ల ద్వారా సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణం పిచికారీ చేయడం ప్రారంభించినట్లు తెలిపారు. లాక్‌డౌన్‌ వల్లే కరోనాను అరికట్టగలిగామని మంత్రి పేర్కొన్నారు.

ప్రతి బుధ, శనివారాల్లో చిన్న పిల్లలకు ఇచ్చే ఇమ్యునైజేషన్‌ ఇక ముందు కూడా కొనసాగించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. సూర్యాపేట పట్టణంలోని కంటైన్‌మెంట్‌ జోన్లను మినహాయించి నాలుగు అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్లతో పాటు వైద్యారోగ్య శాఖ సిబ్బంది.. చిన్న పిల్లల నివాసాలకు వెళ్లి వారికి ఇమ్యునైజేషన్‌ చేయాలని సూచించారు. మున్సిపాలిటీల్లో పని చేస్తున్న శానిటేషన్‌ సిబ్బంది విధిగా మాస్కులు, గ్లౌసులతో పాటు బూట్లు ధరించాల్సిందేనని మంత్రి జగదీశ్‌ రెడ్డి ఆదేశించారు. 


logo