శుక్రవారం 14 ఆగస్టు 2020
Telangana - Jul 17, 2020 , 02:05:58

40 వేలు దాటిన కేసులు

40 వేలు దాటిన కేసులు

  • తాజాగా 1,676 మందికి పాజిటివ్‌
  • జీహెచ్‌ఎంసీ పరిధిలో 788 కేసులు
  • 10 మంది మృతి, 1,296 మంది డిశ్చార్జి 
  • మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావుకు, హైదరాబాద్‌ కలెక్టర్‌కూ పాజిటివ్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి తగ్గడంలేదు. గురువారం 1,676 మందికి పాజిటివ్‌గా తేలడంతో మొత్తం కేసుల సంఖ్య 40 వేలు దాటింది. అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 788 మందికి వైరస్‌ సోకినట్టు వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో పేర్కొన్నది.  రంగారెడ్డిలో 224 మంది, మేడ్చల్‌ మల్కాజిగిరిలో 160, కరీంనగర్‌ 92, నల్లగొండ 64, సంగారెడ్డి 57, వనపర్తి 51, వరంగల్‌రూరల్‌ 47, నాగర్‌కర్నూల్‌ 30, మెదక్‌ 26, నిజామాబాద్‌, సూర్యాపేటలో 20, మహబూబాబాద్‌ 19, ఖమ్మం 10, జయశంకర్‌భూపాలపల్లి, వికారాబాద్‌ 8 చొప్పున, పెద్దపల్లి, నారాయణపేట 7, మహబూబ్‌నగర్‌, భద్రాద్రికొత్తగూడెం 6, సిద్దిపేట, కామారెడ్డి, జోగుళాంబగద్వాల 5 చొప్పున, మంచిర్యాల 4, రాజన్న సిరిసిల్ల 3, వరంగల్‌రూరల్‌, జగిత్యాల, యాదాద్రిభువనగిరి, జనగామ జిల్లాల్లో 1 చొప్పున కేసులు నమోదయ్యాయి. 

వైరస్‌తోపాటు ఇతర అనారోగ్యకారణాలతో 10 మంది మృతిచెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 396కు పెరిగింది. 1,296 మంది డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో బాధితుల రికవరీ రేటు 67 శాతంగా ఉన్నదని వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఇప్పటివరకు 2.22 లక్షల నమూనాలను పరీక్షించామని పేర్కొన్నది. రాష్ట్రవ్యాప్తంగా 15,389 పడకలు అందుబాటులో ఉన్నట్టుచెప్పింది. కాగా, నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆయనతోపాటు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ సిబ్బందిలో ఇద్దరికి వైరస్‌ సోకింది. హైదరాబాద్‌ కలెక్టర్‌ శ్వేతామహంతి సైతం వైరస్‌ బారినపడ్డారు.  కలెక్టరేట్‌లోని           15 మందికి సిబ్బందికి కరోనా సోకగా, వారి ద్వారా కలెక్టర్‌కు వ్యాప్తిచెందినట్టు తెలుస్తున్నది.

అలంపూర్‌ కౌన్సిలర్‌ మృతి

జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్‌ పట్టణంలోని 5వ వార్డు మున్సిపల్‌ కౌన్సిలర్‌ ఎరుకలి దేవన్న (62)కరోనాతో మృతిచెందారు. ఆయన కొద్దిరోజులుగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. రెండ్రోజుల కిందట కరోనా లక్షణాలతో పరిస్థితి విషమించి గురువారం మృతిచెందారు.

వరవరరావుకు కరోనా

భీమా-కోరెగావ్‌ కేసులో జైలుపాలైన వరవరరావుకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ముంబైలోని జేజే దవాఖాన డీన్‌ డాక్టర్‌ రంజిత్‌ మాన్కేశ్వర్‌ ధ్రువీకరించారు. ముంబైలోని తలోజా జైలులో ఉన్న వరవరరావుకు ఆరోగ్యం బాగలేకపోవడంతో జేజే దవాఖానకు తరలించిన విషయం తెలిసిందే. అక్కడ నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఆయనకు పాజిటివ్‌ అని తేలింది.

రాష్ట్రంలో కరోనా కేసుల వివరాలు

వివరాలు
గురువారం
మొత్తం 
పాజిటివ్‌కేసులు
1,676
41,018  
డిశ్చార్జి అయినవారు
1,296
27,295
మరణాలు
10396
చికిత్స పొందుతున్నవారు
-13,328


జిల్లాల్లో ర్యాపిడ్‌ టెస్టులు ఉద్ధృతం


గురువారం వరంగల్‌ గ్రేటర్‌ వరంగల్‌లోని దేశాయిపేట్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్ట్‌ కిట్‌ ద్వారా కొవిడ్‌ పరీక్ష చేస్తున్న దృశ్యమిది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా నిర్ధారణ పరీక్షలను ప్రభుత్వం ఉద్ధృతం చేసింది. ఇప్పటికే జిల్లాలకు ఈ కిట్లు చేరాయి. వీటిద్వారా అరగంటలోపే ఫలితం వెలువడనున్నది. గురువారం నుంచి జిల్లాల్లో పరీక్షలు విస్తృతంగా మొదలుపెట్టారు. శుక్రవారం నుంచి అన్ని జిల్లాలల్లోని పీహెచ్‌సీల్లోనూ పరీక్షలు చేయనున్నారు. 

లాయర్లకు కరోనా ప్రత్యేక చికిత్స 

కొవిడ్‌-19 బారినపడిన న్యాయవాదులకు చికిత్స అందించేందుకు హైదరాబాద్‌లో ప్రభుత్వం మూడు ప్రత్యేక దవాఖానలను గుర్తించింది. కామినేని హాస్పిటల్‌ (ఎల్‌బీనగర్‌), మల్లారెడ్డి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (సూరారం కాలనీ), తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (టిమ్స్‌)లో న్యాయవాదులు చికిత్స పొందవచ్చని ప్రభుత్వం తెలిపింది. జిల్లాల్లోని న్యాయవాదులు కొవిడ్‌ చికిత్సల కోసం సంబంధిత డీఎంహెచ్‌వో, జిల్లా లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ (డీఎల్‌ఎస్‌ఏ)తో సమన్వయం చేసుకోవాలని, వారు అక్కడ అందుబాటులో ఉన్న టీచింగ్‌ హాస్పిటల్స్‌ను గుర్తించి చికిత్స అందిస్తారని పేర్కొన్నది. న్యాయవాదుల వైద్య అవసరాల కోసం రాష్ట్ర బార్‌కౌన్సిల్‌తో సమన్వయం చేసుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ నోడల్‌ అధికారిని కేటాయించింది. న్యాయవాదుల కోసం చొరవ చూపిన హైకోర్టుకు, రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ కృతజ్ఞతలు తెలియజేసింది.


logo